వరంగల్ లీగల్: మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తున్న భర్తను గొంతు నులిమి హత్య చేసిన నేరస్తురాలికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ సోమవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం దావుమోర్మ తండాకు చెందిన బట్టు వెంకన్న దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వెంకన్న మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు విస్మరించాడు. భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈ క్రమంలో తాగుడు మాన్పించడానికి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. పైడిపల్లి సమీపంలోని ఆర్‌ఎన్‌నగర్‌లో స్థలం కొనుగోలు చేసి గుడిసె వేసుకొని కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. వెంకన్న మద్యం మానకపోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం భార్య నగరంలోని మోటారు షోరూంలో పనికి వెళ్లేది. పనికి వెళ్లి వస్తున్న క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ లావుడ్య ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడి క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు జరిగాయి. దీంతో భార్య కొద్ది రోజులు భర్త, పిల్లలను వదిలేసి వెళ్లింది. తిరిగి వచ్చి తప్పు అయ్యిందని చెప్పి కలిసి ఉన్నారు. 2023, ఏప్రిల్ 20న మేసీ్త్ర పనికి వెళ్లిన వెంకన్న రాత్రి 8.30 గంటలకు తాగిన మైకంలో ఇంటికి వచ్చాడు. భార్యను దూషించి విపరీతంగా కొట్టాడు. అలాగే నిద్రపోయాడు. జరిగిన గొడవను ఫోన్ ద్వారా భార్య.. లావుడ్య ప్రశాంత్‌కు చెప్పింది. ఇదే అదునుగా నీ భర్తను చంపదామని చెప్పాడు. నాకు భయంగా ఉంది నేను చంపలేనని తెలుపగా లావుడ్య ప్రశాంత్ ప్రోద్బలంతో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్త వెంకన్నపై కూర్చొని గొంతు నులిమి చంపింది. తిరిగి వెళ్లి పిల్లలతో కలిసి పడుకుంది. ఏమి తెలియనట్లు తెల్లవారి ఉదయం 6 గంటలకు భర్తను నిద్రలేపింది. చనిపోయిన విషయం తమ పెద్దకుమారుడి ద్వారా బంధువులకు తెలిపింది. వెంకన్న తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు వెంకన్న భార్యతోపాటు లావుడ్య ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించగా వెంకన్న భార్యపై హత్య నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జడ్జి నిర్మలాగీతాంబ తీర్పు వెల్లడించారు. మరో నిందితుడు ప్రశాంత్‌పై నేరం రుజువుకానందున విడుదల చేశారు. కేసును పోలీస్ అధికారులు మహేందర్, సురేశ్ పరిశోధించగా, లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో మహిళా కానిస్టేబుల్ తస్లీమ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావటి మురళీధర్ కేసును వాదించారు.


