మంగపేట : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కోతుల దాడి నుంచి రక్షణ కరువైందని భక్తులు వాపోతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలిపై కోతి దాడిచేసి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్న విషయం విదితమే. సోమవారం కొందరు భక్తులు స్వామివారి లడ్డు, పులిహోర ప్రసాదాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దాడి చేయడంతో ప్రసాదాలను వదిలి వేయడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకు నేందుకు ప్రతి శని, ఆదివారం సుమారు ఆరువేల మది, మిగతా రోజుల్లో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఇక్కగ వేల సంఖ్యలో కోతుల దండు భక్తుల చేతిలో ఏది కనిపించినా దాడి చేస్తుండడంతో కర్ర లేకుండా దర్శనం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో వానర సైన్యం ఎటు నుంచి వచ్చి మీదపడి దాడి చేస్తాయో తెలియక ఆలయానికి వచ్చే భక్తులు కొబ్బరి కాయ కొట్టలేక, కనీసం స్వామివారి ప్రసాదాలను కూడా కొనుగోలు చేయకుండా వెళ్లాల్సి వస్తోంది. భక్తుల ద్వారా ఏటా రూ.కోటికిపైగా ఆదాయం కలిగిన ఆలయంలో రక్షణ కోసం దేవాదాయశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


