నెహ్రూసెంటర్ : ఏడాది క్రితం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ‘మనిషి బతికుండగానే మార్చురీలో పెట్టిన’ అమానవీయ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని డీఎంఈ ఆదేశాల మేరకు సోమవారం బృంద సభ్యులు జీజీహెచ్‌కు వచ్చి మరోసారి విచారణ చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే బృందం విచారణ జరిపింది. అయితే అసంపూర్తి సమాచారం కాకుండా పూర్తిస్థాయిలో చేపట్టాలని డీఎంఈ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో బృందం విచారణ చేపట్టింది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా మార్చురీ ఘటనపై బృందం మరోసారి విచారణ చేపట్టిందని, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులను నుంచి వివరాలు తెలుసుకున్నారన్నారు. బృందం ఈ నివేదికను డీఎంఈకి అందజేస్తుందని పేర్కొన్నారు. కాగా, మార్చురీ ఘటనపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటువేసి చేతులు దులుపుకున్నారని, ఏడాది గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికై నా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


