కాజీపేట మీదుగా వెళ్లే రెండు రైళ్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా వెళ్లే రెండు రైళ్లు రద్దు

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ మీదుగా వెళ్లే తిరుపతి–రక్సోల్‌–తిరుపతి మధ్య వెళ్లే రెండు రైళ్లు సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలోని చక్రాధర్‌పూర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని బగ్దేహి–జర్సుగూడ మధ్య 4వ రైల్వే లైన్‌ నిర్మాణంతో ఈ నెల 2, 5వ తేదీన రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు.

రద్దు అయిన రైళ్ల వివరాలు

2వ తేదీన తిరుపతి–రక్సోల్‌ (17433) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 5వ తేదీన రక్సోల్‌–తిరుపతి (17434) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

70.3 ట్రాయాథాన్‌ పూర్తి చేసిన నిఖిల్‌

ములుగు రూరల్‌ : ములుగు జిల్లా రాయనిగూడెం గ్రామానికి చెందిన వజ్జ నిఖిల్‌ ఆదివారం గోవాలో జరిగిన 70.3 ట్రాయాథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఫినిషర్‌గా నిలిచాడు. ఈ పోటీల్లో 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్‌, 90 కిలో మీటర్ల సైక్లింగ్‌, 21.1 కిలో మీటర్ల రన్నింగ్‌ మొత్తం కలిసి 113 కిలో మీటర్ల దూరాన్ని పూర్తి చేశాడు. నిఖిల్‌ తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ప్రదేశాల విశిష్టతను తన క్రీడా ప్రయాణం ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నారు. 2027లో ఫ్రాన్స్‌లో జరిగే పుల్‌ ఐరన్‌ మ్యాన్‌ ట్రయాథాన్‌ను 3.8 కిలో మీటర్ల ఈత, 180 కిలో మీటర్ల సైక్లింగ్‌ 42.2 కిలో మీటర్ల పరుగు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

కోతుల దాడిలో

ఒకరికి తీవ్ర గాయాలు

భూపాలపల్లి రూరల్‌ : కోతుల దాడిలో ఒకరికి కాలు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసీంపల్లి గ్రామానికి చెందిన బొర్లకుంట లక్ష్మయ్య తన ఇంటి స్లాబ్‌పై చిరుధాన్యాలు ఆరబెట్టాడు. దీంతో కోతులు స్లాబ్‌పైకి వచ్చి ధాన్యాన్ని చిందర వందర చేస్తుండగా లక్ష్మయ్య స్లాబ్‌పైకి వెళ్లి కోతులను తరిమాడు. ఈ క్రమంలో ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా కోతులు మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పించుకునే తరుణంలో కాలుజారి స్లాబ్‌నుంచి లక్ష్మయ్య కింద పడగా కాలు విరిగింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు.

హేమాచల క్షేత్రంలో భక్తురాలిపై..

మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తురాలిపై కోతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన భక్తురాలు పిల్లలమర్రి మౌనిక తనతల్లి దుర్గమ్మ మరికొందరితో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చింది. కొండపై ఆలయంలో స్వామివారి తిల తైలాభిషేకం తిలకించేందుకు భక్తులతో పాటు కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కోతి దాడి చేసింది. ఎడమ చేతిని కొరకడంతో తీవ్ర గాయమై రక్తస్రావమైంది. అక్కడే ఉన్న ఆలయ మాజీ చైర్మన్‌ చిట్యాల పురుషోత్తం భక్తుల సాయంతో హుటాహుటిన ఆమెను మంగపేట పీహెచ్‌సీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement