సీతారాంపురం బస్‌స్టేజీ సమీపంలో మహిళ ..
దేవరుప్పుల : రోడ్డు ప్రమాదంలో తల్లి తనువు చాలించగా.. తండ్రి, కూతురికి గాయాలపాలైన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా అర్బన్‌వాడ (తల్మడ) మండల వ్యవసాయ అధికారి చెవ్వుల పోచయ్య కూతురు స్వర్ణప్రియకు ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందింది. కాగా, ఈ నెల 3వ తేదీన అగ్రికల్చర్ స్లైడింగ్ ఆప్షన్ ఉంది. సమీప ప్రాంతాల్లోకి మార్చుకునేందుకు సంసిద్ధమైన పోచయ్య ఆదివారం తమ కూతురును స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కారులో భార్య పద్మతో హుజూర్‌నగర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దేవరుప్పుల మండలం సీతారాంపురం బస్ స్టేజీ సమీపంలో రాత్రి 7 గంటలకు మలుపు వద్ద ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జనగారెడ్డిగూడేనికి చెందిన ఈపు శ్రీను (సింహాద్రి) టాటా ఏస్ వాహనంతో ఢీకొట్టాడు. ఈ సంఘటనతో కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న పోచయ్యకు స్వల్ప గాయాలు కాగా.. భార్య పద్మ, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలోనే పద్మ మృతి చెందింది. భార్య మృతి చెందని విషయం తెలియని పోచయ్య ఫోన్‌లో తమ బంధువులకు సమాచారం ఇస్తూ ఏడ్చిన తీరు ఆస్పత్రిలో కలిచివేసింది. తర్వాత విషయం తెలియగా అయ్యో పద్మ ఎందుకు తీసుకు వస్తిని, నీ ప్రాణం తీస్తిని నా గతేట్లా.. కూతురుకు ఏం సమాధానం చెప్పాలని రోదించారు. ఎస్సై చింత రాజు సూచనల మేరకు కానిస్టేబుల్ గౌస్ తదితరులు పరిశీలించి రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది కాకుండా చర్యలు చేపట్టారు. పద్మ మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపర్చారు.
లారీని ఢీకొని యువకుడు..
వలిగొండ : బైక్‌పై వెళ్తున్న యువకుడు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూర్ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయికి చెందిన దౌపటి వీరస్వామి(36) బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పని మీద బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో వలిగొండ మండలం అర్రూర్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
బైక్ అదుపు తప్పి చిరువ్యాపారి..
హసన్‌పర్తి : ౖబెక్ అదుపు తప్పడంతో చిరువ్యాపారి ఎస్సారెస్పీ కాల్వలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలివేల్పుల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్లకు చెందిన ఎస్.సతీష్ (42) వృత్తిరీత్యా చిరువ్యాపారి. కొంతకాలంగా వరంగల్ నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం సతీష్ బైక్‌పై పలివేల్పులకు పయనమయ్యాడు. మార్గమధ్యలోని ఎస్సారెస్పీ కాల్వ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పడంతో సతీష్ కాల్వలో పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆదివారం ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


