పెళ్లి కావడంలేదని యువకుడు..
లింగాలఘణపురం : మండలంలోని కొత్తపల్లికి చెందిన గర్వందుల కృష్ణ (28) పెళ్లి కావడంలేదని మనస్తాపంతో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కిశోర్ కథనం ప్రకారం.. కృష్ణ పెళ్లి ఈడుకు వచ్చినా సంబంధాలు రాకపోవడంతో అతడు తాగుడుకు బానిసయ్యాడు. ఆదివారం తండ్రి సుధాకర్‌తో వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నానని చెప్పి బైక్‌పై వెళ్లాడు. అక్కడే సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీపంలో పనులు చేస్తున్న యాదగిరి గమనించి కృష్ణ తండ్రికి ఫోన్‌లో విషయం తెలియజేయగా వెంటనే సుధాకర్ అక్కడికి వచ్చి చూశాడు. అప్పటికే కృష్ణ చెట్టుకు ఉరి వేసుకొని విగతజీవిగా ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిశోర్ వివరించారు.
ప్రేమ పెళ్లికి నిరాకరించారని యువతి..
కొడకండ్ల : ప్రేమించిన యువకుడు..అతడి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ సంఘటన రామవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడపల్లి మానస (18) కొడకండ్లకు చెందిన టాటూ ఆర్టిస్ట్ చెన్న సాయిగణేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని మానస కోరగా సాయి గణేష్‌తో పాటు అతడి తల్లిదండ్రులు సత్యం, కవిత నిరాకరించి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన మానస శనివారం సాయంత్రం గడ్డి మందు తాగి వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మానస తండ్రి సోమయ్య ఫిర్యాదుతో యువతి మృతికి కారణమైన యువకుడు అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో మహిళ..
చిల్పూరు : మండలంలోని రాజవరం గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి (55) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శ్రవణ్ కుమార్‌గౌడ్ కథనం ప్రకారం.. పేద కుటుంబానికి చెందిన లక్ష్మి కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తట్టుకోలేక మనోవేదనకు గురై ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు.


