రాయపర్తి : మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో హృదయ విదారకమైన ఘటన జరిగింది. మాజీ సర్పంచ్ గజవెల్లి అనంతప్రసాద్ అప్పు తీసుకుని తిరిగి ఇవ్వక పోవడంతోనే తమ ఇంటిపెద్ద ప్రాణాలు కోల్పోయాడంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తిర్మలాయపల్లికి చెందిన వృద్ధుడు ముద్రబోయిన ముత్తయ్య (70) కొంతకాలంగా ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. మాజీ సర్పంచ్ అనంతప్రసాద్‌కు తాను రూ.2లక్షలు అప్పు ఇవ్వగా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో రోజూ అడుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురై బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ‘మా నాన్న నమ్మి అప్పు ఇస్తే తిరిగి ఇవ్వకపోవడంతో గుండె పగిలి చనిపోయాడు, మాకు న్యాయం చేయాలి’ అంటూ కొడుకు నర్సయ్య కన్నీరుమున్నీరయ్యాడు. డబ్బులు ఇప్పించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకంతో ఇస్తే చివరకు ప్రాణాలే పోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
70 ఏళ్ల ముత్తయ్య మృతి
మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట
మృతదేహంతో ఆందోళన


