మహబూబాబాద్ రూరల్ : దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను పరిరక్షించడం ప్రతీ పౌరుడి కర్తవ్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, పోలీసు అధికారులు, సిబ్బంది సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
కలెక్టరేట్‌లో..
మహబూబాబాద్: కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులతో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో నాగలక్ష్మి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు ఆదర్శం
ఎస్పీ శబరీష్


