పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు..
కురవి: ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణా ల మీదకు తెచ్చింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురం శివారులో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. కురవిలోని గీతాంజలి ప్రైవేట్ స్కూల్‌కు చెందిన టాటా మ్యాజిక్ వ్యాన్ డ్రైవర్ కురవిలో కొందరు, రేకుల తండా, రాంచంద్రాపురం, తిర్మలాపురంలో మరికొందరు విద్యార్థులను ఎక్కించుకున్నాడు. మొత్తం 12 మంది చిన్నారులను వ్యాన్‌లో ఎక్కించుకున్నాడు. వ్యాన్ తిర్మలాపురం నుంచి నల్లెల్ల వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ పందిరి రాజేశ్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు. దీంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు అంచు నుంచి చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. చెరువు శిఖంలో ఉన్న చెట్టును తాకి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
రక్షించిన చెట్టు..
స్కూల్ వ్యాన్ చెరువు పక్కన ఉన్న రోడ్డు మీద నుంచి వెళ్తోంది. ఈ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడంతో అదుపు తప్పి కల్వర్టు అంచు నుంచి చెరువులోకి దూసుకెళ్తోంది. దీంతో వ్యాన్‌లో ఉన్న చిన్నారులు హాహా కారాలు చేశారు. ఏడుపులు, అరుపులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. వ్యాన్ చెరువులోకి బోల్తా పడుతూ ఆ పక్కనే ఉన్న చెట్టుకు తాకి ఆగిపోయింది. దీంతో చెట్టు .. వ్యాన్‌లో ఉన్న 12 మంది ప్రాణాలను కాపాడినట్లైంది. రేకుల తండాకు చెందిన రెండో తరగతి బాలిక దక్షిత, రాంచంద్రాపురానికి చెందిన యూకేజీ విద్యార్థి వేదాన్ష్, కురవికి చెందిన కానుగంటి తన్మయశ్రీ, కల్లెపు వేదాన్ష్, కల్లెపు వేదతోపాటు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. 12 మంది ప్రాణాలను చెట్టు కాపాడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వ్యాన్‌లో ఉన్న విద్యార్థులను తిర్మలాపురం గ్రామస్తులు బయటకు తీశారు.
డ్రైవర్ రాజేశ్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, వ్యాన్ కూడా పాతది కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేయాలన్నారు. డ్రైవర్ రాజేశ్‌పై దాడికి యత్నించగా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలియడంతో కురవి ఎస్సై సతీశ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గాయపడిన చిన్నారులను ఓదార్చారు. చెరువులో బోల్తా పడిన వ్యాన్‌ను బయటకు తీయించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. కాగా, వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని డ్రైవర్ రాజేశ్ తెలిపారు.
చెరువులో బోల్తా పడిన ప్రైవేట్
స్కూల్ వ్యాన్
పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
తప్పిన పెను ప్రమాదం..
పిల్లలను కాపాడిన చెట్టు


