● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు: ములుగు జిల్లాలోని జంగాలపల్లి గుట్టను టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క (అనసూయ) తెలిపారు. శుక్రవారం ములుగు నూతన సమీకృత కలెక్టరేట్‌లోని తన స్టేట్ చాంబర్‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పర్యాటక అభివృద్ధి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమన్వయంతో జిల్లా స్థాయి కమిటీ ద్వారా అనుమతుల ప్రక్రియ చేపట్టాలన్నారు. అనంతరం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడుతూ జంగాలపల్లి గుట్టకు దక్షిణాఫ్రికాలోని టేబుల్ మౌంటెన్‌ను పోలిన ఆకృతి ఉందన్నారు. గుట్టపై నుంచి ఒకవైపు లక్నవరం, మరోవైపు రామప్ప కనిపించే వ్యూ పాయింట్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్ రావు, టూరిజం నోడల్ అధికారి ధర్మ నాయక్, డీఆర్‌డీఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


