గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వనరుల అన్వేషణ
సాక్షి, మహబూబాబాద్: ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు గత నెల 28న కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. తాగునీటి వనరులపై దృష్టిసారించాలని సూచించారు. కాగా, జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
110 రోజులకు నీటి నిల్వలు..
జిల్లాలోని ఆవాసాలు, గృహాలు, జనాభా వివరాలతో పాటు పాలేరువాగు, గోదావరి, మల్లన్నసాగర్ ద్వారా అందుతున్న నీరు, నిల్వలపై చర్చించారు. కాగా, అధికారుల అంచనాల ప్రకారం 110 రోజు లకు సరిపడా తాగునీరు అందించేందుకు నిల్వలు ఉన్నాయని వివరించారు. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగదని భావించారు. అయితే ఆ తర్వాత నీటి లభ్యత, ప్రస్తుతం ఉన్న నీటిమట్టం తగ్గే అవకాశం ఉంది. దీంతో ముందుస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నీటి వనరులను కలెక్టర్, అదనపు కలెక్టర్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు పరిశీలించి.. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మండలాల్లో బృందాల ఏర్పాటు..
ప్రస్తుత పరిస్థితులను తెలుసుకొని, భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మండలాల్లో బృందాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 1నుంచి 15వ తేదీ వరకు ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రిడ్ ఏఈలు, సర్పంచ్‌లు, కార్యదర్శులు బృందాలుగా గ్రామాల్లో సందర్శిస్తారు. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా.. ప్రస్తుతం ఇతర వనరులను వినియోగించుకుంటున్నారా.. విద్యుత్ సమస్యతో కలిగే ఇబ్బందులు తెలుసుకొని సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా గ్రామాల్లోని పాత బోర్లు, చేతి పంపులు, బావులు, వ్యవసాయ బావుల ద్వారా తాగునీరు అందించే అవకాశం ఉందా.. అనే విషయాలపై స్పష్టత కలిగి ఉండడంతో పాటు మరమ్మతులు చేయించాలి. ఇలా ప్రతీ మండలంలో సమాయత్తం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే మండలాల్లో అధికారులు పర్యటించి స్థానిక నీటి వనరులను గుర్తించడం, మరమ్మతులు చేయించే పనిలో నిమగ్నమయ్యారు.
సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పటినుంచే అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గత నెల 28న జిల్లాలోని ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. దిశానిర్దేశం చేశారు. దీంతో అన్ని మండలాల్లో అప్రమత్తంగా ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.
– డి.పుష్పలత, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్
జిల్లాలో తాగునీటి సరఫరా ఇలా..
ఆవాసాలు : 1,320
నివాస గృహాలు : 1,60,321
జనాభా : 7,40,770
ప్రతీరోజు కావాల్సిన నీరు : 53,467 కేఎల్
ప్రస్తుతం సరఫరా
అవుతున్న తాగునీరు : 50,270కేఎల్
ప్రత్యామ్నాయ నీటి వనరులు
బోర్లు : 1,195
చేతి పంపులు : 2,096
బావులు : 999
పాత బావుల పూడికతీత, బోర్ల మరమ్మతులకు సిద్ధం
అవసరమైతే వ్యవసాయ బావులు, బోర్లు లీజుకు తీసుకునే అవకాశం


