పెద్దలకు పరీక్ష! | - | Sakshi
Sakshi News home page

పెద్దలకు పరీక్ష!

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

● ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అన్ని పార్టీల్లో బాధ్యుల నియామకం

● నమోదులో ముందుండాలని ఆదేశాలు

● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు

సాక్షి, మహబూబాబాద్‌: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. పట్టభద్రులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుంటేనే ఓటు హక్కు ఉంటుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు మొదట పట్టభద్రులతో ఓటరుగా నమోదు చేయించే పనిలో ఉన్నారు. ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. అయితే జిల్లా ఇన్‌చార్జ్‌లుగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాగా.. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా స్థానికులనే నియమించారు. టార్గెట్‌ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ఓటర్ల నమోదు పార్టీ పెద్దలకు పరీక్షగా మారింది. మండలాల వారీగా బాధ్యతలు అప్పగించి ఓటరు నమోదును వేగవంతం చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా ఓటరు నమోదు..

వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. 2021 ఎన్నికల సందర్భంగా 5,63,282 ఓట్లు నమోదు కాగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు 3,11,095 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఇందులో మహబూబాద్‌ జిల్లాలో మొత్తం 39,273 మంది ఓటర్లు ఉండగా.. 25,322 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటరు నమోదు చేయిస్తే తమ పార్టీకి విధేయులుగా ఉంటారని అన్ని పార్టీల నాయకులు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో ఒక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ఆయా మండలంలోని పట్టభద్రుల వివరాలు సేకరించి ఓటరు నమోదు చేయిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రతీ వంద మందికి ఒక కార్యకర్తను నియమించి ఆ వంద మంది ఓటరు నమోదు బాధ్యతలు అప్పగించారు. వారిపై మండలంలో ఓ నాయకుడు ఇన్‌చార్జ్‌గా ఉంటూ.. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో సమన్వయం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. వీరితోపాటు పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష పార్టీలకు చెందిన వారు తమ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని చెబుతూ.. ఓటు నమోదు చేసుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా, తమ అనుచరుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరుగురు మంత్రులు ఉండి ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపై ఉండగా.. ఈ గెలుపుతో ప్రజలు, మేధావులు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని రుజువు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

అన్ని పార్టీల ఇన్‌చార్జ్‌ల నియామకం

ఓట్ల కన్నా ఓటరు నమోదు కీలకంగా భావించిన అన్ని రాజకీయ పార్టీలు జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏఐసీసీ పరిశీలకులుగా వేగి వెంకటేశ్వర్లు, దుద్దిళ్ల శ్రీనుబాబును నియమించారు. అలాగే మహబూబాబాద్‌, డోర్నకల్‌, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాలకు అక్కడి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మహబూబాబాద్‌ నియోజకవర్గానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, డోర్నకల్‌ నియోజకవర్గానికి మాజీ ఎంపీ మలోత్‌ కవితను నియమించారు. అదే విధంగా బీజేపీ నుంచి జిల్లా ఇన్‌చార్జ్‌గా వన్నాల వెంకటరమణను నియమించారు. మహబూబాబాద్‌ నియోజకవర్గానికి దేసు సురేష్‌, డోర్నకల్‌ నియోజకవర్గానికి ధరావత్‌ నరేష్‌ నాయక్‌ను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement