కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం కొందరు దళారులకు ఆదాయ వనరుగా మారింది. కేసముద్రంలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి.. బ్రాండెడ్ సంచుల్లో నింపి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల కేసముద్రం పట్టణంలో బ్రాండెడ్ సంచుల్లో రేషన్‌బియ్యాన్ని నింపి అధిక ధరలకు విక్రస్తూ పోలీసులుకు పట్టుబడిన ఘటనే ఇందుకు నిదర్శనం.
అక్రమంగా విక్రయాలు..
కేసముద్రంలో కొందరు దళారులు లబ్ధిదారుల నుంచి, కొందరు డీలర్ల నుంచి బియ్యాన్ని కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు వ్యాపారులు ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో మారాడించి నిబంధనలకు విరుద్ధంగా బ్రాండెడ్ సంచుల్లో నింపి విక్రయిస్తున్నారు. అయితే ఈ వ్యాపారంలో కొందరు నాణ్యమైన బియ్యంలో రేషన్ బియ్యాన్ని కలిపి బ్రాండెడ్ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తుండగా.. మరోవైపు మరికొందరు దళారులు రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లులో పాలిష్ చేసి బ్రాండెడ్ సంచుల్లో నింపి అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీంతో నాణ్యమైన బియ్యం అమ్మేవారెవరూ, రేషన్ బియ్యాన్ని కలిపి విక్రయిస్తున్న వ్యాపారులెవరని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
నాణ్యత కష్టాలు..
బ్రాండెడ్ బియ్యం అని నమ్మి క్వింటాకు ధర రూ.7వేల నుంచి రూ.8 వేల చొప్పున కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు నాణ్యత సమస్యలు ఎదురవుతున్నాయి. అన్నం వండిన తర్వాత నాణ్యత లేకపోవడంతో సంబంధిత వ్యాపారులను ప్రశ్నిస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇక దూర ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులు చేసేదీ ఏమీలేక ఆ బియ్యాన్నే వినియోగించుకుంటున్నారు. మరోవైపు కొందరికి కొనుగోలు చేసిన బస్తాల్లో పురుగులు పట్టిన బియ్యం వస్తున్నాయి. ఇలా కేసముద్రం ప్రాంతంతోపాటు, జిల్లాలో పలుచోట్ల నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు, కొన్ని ప్రైవేట్ హాస్టళ్లు, హోటళ్లకు బ్రాండెడ్ పేరుతో రేషన్‌బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు దళారులు మాత్రం ఎలాంటి లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ధాన్యాన్ని అడ్డగోలుగా కొనుగోలు చేసి, బియ్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. కానీ, వినియోగదారులకు విక్రయించే బియ్యం ఎక్కడివి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తున్నారా..? అనే పలు అంశాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్న దళారులు
నాణ్యతపై వినియోగదారుల్లో ఆందోళన
కేసముద్రం ప్రాంతంలో సాగుతున్న దందా


