సాక్షి, వరంగల్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ‘ఎక్స్’వేదికగా గురువారం విచారం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని స్పష్టం చేయడంతో గులాబీ పార్టీకి వ్యతిరేకం కాదనే సంకేతాలిచ్చారని పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆనాడు తాను కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. కేటీఆర్‌ని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదు’అని కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆమె ఎక్స్‌వేదికగా చేసిన పోస్టు ఇప్పుడూ రాజకీయ వర్గాల్లో తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆమె అభివృద్ధి కార్యక్రమాల్లో తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరం దూరంగా ఉంటుండడం, తాజాగా కేటీఆర్‌కు క్షమాపణలు కోరడం చూస్తుంటే రాజకీయంగా ‘కొండ’ంత మార్పులేమైనా ఉంటాయనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు ఆమె తాజా పోస్టే ఉదాహరణ అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఏం జరిగిందంటే...
మంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని, సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలకు కేటీఆర్ కారణమంటూ ఆరోపణలు చేశారు. ప్రముఖ సినీ జంట నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారాన్ని కూడా ఈ వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సినీ ప్రముఖులను డ్రగ్స్‌కు అలవాటు చేశారంటూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. తనపై చేసిన ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. అనంతరం తన ప్రతిష్టకు నష్టం కలిగించారంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ వివాదంపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అక్కినేని కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో తీవ్రంగా స్పందించారు.
సడెన్ పోస్టుతో మళ్లీ అ‘టెన్షన్’..
గత సెప్టెంబర్ మూడో తేదీన మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత కొండా సురేఖ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎప్పుడు కూడా ఒక్క మాట అనలేదు’అని గుర్తు చేశారు. కేసీఆర్‌లో ఎంతో హుందాతనం ఉంటుందని, తాము ఎప్పుడు వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తూ రిసీవ్ చేసుకునేవారని ఆమె చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌లోకి కొండా సురేఖ వెళ్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అటువంటిది ఏమీ లేదని ఆమె వివరణ ఇచ్చారు. తాజాగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలను వెనక్కి తీసుకుంటున్నానంటూ పోస్టు చేశారు. దీంతో మళ్లీ ఆమె బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలో ‘ది వెయిట్ ఈజ్ అల్ మోస్ట్ ఓవర్...బిగ్ అప్‌డేట్ కమింగ్ సూన్’అంటూ కొండా సురేఖ పేరుతో సెప్టెంబర్ నాలుగున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టు తమది కాదంటూ అధికారిక ఖాతాలనుంచి సురేఖ ప్రకటన చేసినా, ఇప్పుడే అదే నిజమవుతోందన్న చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పొలిటికల్ హీట్ ఎటు దారితీస్తుందోనని ప్రజలు, రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.
కేటీఆర్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
వ్యక్తిగత వ్యాఖ్యలపై తాజాగా ఎక్స్ వేదికగా విచారం
రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే
అని వివరణ
ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు
దూరం
ఆమె బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారనే జోరుగా ప్రచారం


