● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు ఉత్తమ బోధన చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. షెడ్యూ ల్ ప్రకారం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం సాధించేలా బోధించాలన్నారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్, తదితర రంగాల వైపు ఎలా వెళ్లాలి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాలి అనే అంశాలపై క్లుప్తంగా వివరించాలన్నారు. డిజిటల్ తరగతులు, ప్రాక్టికల్స్, రైటింగ్, రీడింగ్, క్రీడా, సాంస్కృతిక, సామాజిక అంశాలను బోధించాలన్నారు. పిల్లలు, ఉపాధ్యాయుల హాజరుశాతం కచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడిని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మందుల శ్రీరాములు, వెంకటేశ్వర్లు, హెచ్ఎం కోటయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.


