సాక్షి, మహబూబాబాద్: ప్రజా ఆరోగ్యంపై ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యం వహిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా బయో మెడికల్ వ్యర్థాలను మురికి కాల్వలు, డంపింగ్ యార్డులో పడేస్తున్నారు. ఉపయోగించిన సిరంజీలు, ఖాళీ గాజు సీసాలు, కత్తెరలు, డ్రెస్సింగ్ చేసిన కాటన్, తీసి వేసిన మానవ వ్యర్థాలు ఎస్టీపీ ప్లాంట్లకు తరలించకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ పడేయడంతో వాటినుంచి వెలువడే విషవాయువుతో ప్రాణాలకే ముప్పు ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏం చేస్తున్నారు..
బయో మెడికల్ వ్యర్థాలతో ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఆస్పత్రుల ఏర్పాటుకు అనుమతి పత్రాలు సమర్పించే సమయంలోనే బయో మెడికల్ వ్యర్థాల డిస్పోజిల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సమయంలో సర్టిఫికెట్ ఇచ్చిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తర్వాత నిబంధనలకు కట్టుబడి ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వైద్యాధికారి నుంచి అనుమతి తీసుకున్న ఆస్పత్రులు 158 ఉండగా.. అనుమతులు లేకుండా నడిచేవి కూడా ఉన్నాయి. ఇందులో పదికిపైగా 25 పడకలకు మించిన ఆస్పత్రులు ఉన్నాయి. తక్కువ పడకల ఆస్పత్రిలోని వ్యర్థాలతోపాటు, ఎక్కువ పడకల ఆస్పత్రి వ్యర్థాలను కూడా కొందరు తమ ఎస్‌టీపీ ప్లాంట్‌లో వేసి ఖననం చేయకుండా.. విచ్చలవిడిగా పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీ చెత్తబండిలో వ్యర్థాలు వేయడం, వారు డంపింగ్ యార్డుల్లో పడేయడంతో.. తడి, పొడి చెత్తను వేరుచేయడానికి కార్మికులు భయపడుతున్నారు. అదేవిధంగా ఆస్పత్రి పరిసర ప్రాంతాలు, చెరువులు, వాగుల్లో కూడా వ్యర్థాలను వేస్తున్నారని, దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిన మనుషులకు కూడా సూదులు గుచ్చుకోవడం, దుర్వాసనతో వ్యాధులు ప్రబలడంతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ వ్యర్థాలను రోడ్డుపై సంచరించే గేదెలు, కుక్కలు తినడంతో ఆయా ప్రాంతా లు అపరిశుభ్రంగా ఉండడటం, కుక్కలకు పిచ్చి లేవడంతో ప్రజలు ఇబ్బందుల పాలు అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి బయో వ్యర్థాలను విచ్చలవిడిగా పడేసే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల బారిన పడుతున్న వారిని రక్షించాలని కోరుతున్నారు.
ఎక్కడ పడితే అక్కడ బయో మెడికల్ వ్యర్థాలు
మున్సిపాలిటీ చెత్తబండిలో వేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం
ఆస్పత్రుల్లో కనిపించని ఎస్‌టీపీ ప్లాంట్లు
వ్యాధుల బారిన పడుతున్న మున్సిపల్ కార్మికులు, ప్రజలు
బయోవ్యర్థాలను ఏం చేయాలి?
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వినియోగించే సిరంజీలు, ఖాళీ గాజు సీసాలు, కత్తెరలు, డ్రెస్సింగ్ చేసిన కాటన్, తీసి వేసిన మానవ వ్యర్థాలు, సూదులు, ఖాళీ గ్లూకోజ్ బాటిళ్లను బయో మెడికల్ వ్యర్థాలు అంటారు. వీటిని వినియోగించిన తర్వాత ప్రత్యేక గదిలో భద్రపరిచి 25 పడకలకు పైగా ఉన్న ఆస్పత్రి అయితే ఎస్‌పీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ప్లాంట్‌లో ఖననం చేయాలి. అంతకన్నా తక్కువ బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను సేకరించే వాహనానికి అందించాలి. ఇలా సేకరించిన వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ వద్దకు తీసుకెళ్లి ప్లాస్టిక్, గాజు, ఇనుము ఇలా వేరు చేసి అధిక ఉష్ణోగ్రతతో ఉన్న మిషన్‌లో వేస్తారు. దీంతో అక్కడ మొత్తం కరిగిపోతుంది. ఇలా చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.
జాగ్రత్తగా ఉండాలి
ఆస్పత్రుల్లో వినియోగించిన వస్తువులు, వ్యర్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటితో ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం ఎస్‌టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి.
తక్కువ పడకల ఆస్పత్రిలోని వ్యర్థాలను వరంగల్ నుంచి వచ్చే బయో మెడికల్ వేస్టేజీ వాహనానికి ఇవ్వాలి. లేదంటే చర్యలు తీసుకుంటాం.
– రవి రాథోడ్, జిల్లా వైద్యాధికారి


