నెల్లికుదురు: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంటింటికీ లబ్ధిచేకూరుతుందని రాజ్యసభ సభ్యడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని కళాశాల, పాఠశాల ఆవరణలో తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నిధులు రూ.7.50 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) భవన నిర్మాణానికి కలెక్టర్ స్నేహశబరీష్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్‌తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విశ్రాంతి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మురళీనాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వేం నరేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 122 టీపీఎస్‌లు మంజూరు కాగా మొదటగా నెల్లికుదురు మండలంలో శంకుస్థాపన చేసుకోవడం మండలానికి దక్కిన ఘనత అన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్‌కు ధీటుగా టీపీఎస్‌లు రాబోతున్నాయన్నారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ 1984లో ఐదో తరగతిలో చేరడానికి వస్తే అడ్మిషన్ దొరకలేదంటే ఇక్కడ విద్య ఎంత నాణ్యతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని గుర్తు చేశారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, సర్పంచ్ పులి వెంకన్న, మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జ్యోతి, నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, ఎదళ్ళ యాదవరెడ్డి, సత్యపాల్‌రెడ్డి, బాలాజీ నాయక్, రంజిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి
రూ.7.50కోట్లతో టీపీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన


