బాలికల భద్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలికల భద్రత అందరి బాధ్యత

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

తొర్రూరు: బాలికల భద్రత అందరి బాధ్యతని స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, ర్యాగింగ్‌ నిరోధక చట్టాలు, మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పోక్సో యాక్టు గురించి వివరించారు. బాలికలు ఎక్కడైన వేధింపులకు గురైతే వెంటనే 1098, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, ఎస్‌ఓ శైలజ, న్యాయవాదులు రామకృష్ణ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి

డోర్నకల్‌: ఆయిల్‌పామ్‌ రైతులు ఎల్‌నినో పరిస్థితులతో రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ శాస్త్రవేత్త అట్లూరి ప్రశాంత్‌ కోరారు. మండలంలోని అమ్మపాలెం రైతువేదికలో మంగళవారం ఆయిల్‌పామ్‌ రైతులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మొక్కల పెరుగుదల, ఎరువుల వినియోగం, అధిక దిగుబడులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం అమ్మపాలెం పరిధిలోని ఆయిల్‌పామ్‌ తోటలను అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి ఆర్‌.శాంతిప్రియ, వ్యవసాయశాఖ అధికారి కె.అనిల్‌కుమార్‌, ఏఈఓలు అనూష, లెనిన్‌, హెచ్‌ఈఓ విజయపాల్‌రెడ్డి, ఫీల్డ్‌ అధికారి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలను అరికట్టాలి

గార్ల: బాల్య వివాహాలను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష కోరారు. మంగళవారం గార్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమంపై బాలికలకు అవగాహన కల్పించారు. బాలికల రక్షణ, విద్య, సాధికారిత, సమాన అవకాశాల కల్పనలో బేటీ బచావో– బేటీ పడావో ప్రాముఖ్యతను వివరించారు. బాలికలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, పోషకాహారం తీసుకోవాలన్నారు. సమావేశం అనంతరం బాలికలకు న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాజకుమారి, డోర్నకల్‌ సీడీపీఓ లక్ష్మి, డీహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్‌ మహేశ్వరి, అరుణ, సంధ్యారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పంట మార్పిడితో అధిక దిగుబడి

మహబూబాబాద్‌ రూరల్‌: పంట మార్పిడితో అధిక దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు విజయచంద్ర, మరియన్న అన్నారు. ఆయిల్‌పామ్‌ సమస్యలు, ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన చర్యలపై మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసి రైతులు అధిక ఆదాయం పొందాలన్నారు. అనంతరం ఆయిల్‌ పామ్‌ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో జిల్లా ఆయిల్‌ పామ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వల్లూరి కృష్ణారెడ్డి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ యాదగిరి, నాబార్డ్‌ డీడీఎం సాయిరాం, ఆత్మచైర్మన్‌ గోవర్ధనరెడ్డి, ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారులు తిరుపతిరెడ్డి, రాంజీ, సహాయ రిజిస్ట్రార్‌ సుమలత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement