పెండింగ్‌ ఫైళ్లకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ఫైళ్లకు మోక్షం

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

సాక్షి, మహబూబాబాద్‌: రెండునెలలుగా జిల్లా విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖలో కూరుకుపోయిన ఫైళ్లకు మోక్షం వచ్చింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకోవడానికి ఇతర జిల్లాల అధికారులు భయపడుతున్న నేపధ్యం, జిల్లాకు విద్యాశాఖ అధికారిగా వచ్చిన వారి పరిస్థితి, అధికారులు లేకపోవడంతో పలు ఫైళ్లు పెండింగ్‌ విషయంపై ‘సాక్షి’లో ‘వామ్మో మానుకోట’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి స్పందించిన కలెక్టర్‌ స్నేహశబరీష్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అనిల్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో రెండు రోజులుగా విద్యాశాఖలోని పెండింగ్‌ ఫైళ్లను తెప్పించుకొని పరిశీలించి సంతకాలు పెడుతున్నారు.

రెండునెలలుగా పెండింగ్‌

జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన అధికారి కుమారుడు చనిపోవడంతో విధులకు రాకుండా సెలవు పెట్టారు. దీంతో ఆయన స్థానంలో ఖమ్మం డీఈఓ వాసంతి, తర్వాత మరో అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారెవ్వరు మానుకోటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో రెండు నెలలుగా మెడికల్‌, మెయింటెనెన్స్‌, ట్రైనింగ్‌తోపాటు కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌కు సంబంధించిన డైట్రీ, నాన్‌ డైట్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమైన ఉత్తర, ప్రత్యుత్తరాలు, పీఎంశ్రీ పాఠశాలకు మంజూరైన నిధులతో డిక్షనరీల, ఇతర వస్తువులు, నిర్వహించే కార్యక్రమాల ఖర్చుల బిల్లులు మొత్తం సుమారుగా రూ.1 కోటికి పైగా పెండింగ్‌లోనే ఉన్నాయి. తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న జిల్లా పరీక్షల విభాగం అధికారి శ్రీరాములు సంతకాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండునెలలుగా ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఆచీతూచీ..సంతకాలు..

విద్యాశాఖలోని కీలకమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం, పిల్లలకు ఇబ్బందులు కలుగుతున్న విషయంపై స్పందించిన కలెక్టర్‌ ఆ బాధ్యతలు జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అనిల్‌ కుమార్‌కు అప్పగించారు. అయితే ఇప్పటికే ఓవైపు ఎస్‌ఐఆర్‌, మరో వైపు భూముల రీసర్వే, ఇంకో వైపు పౌర సరఫరాలు, ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్‌ పెండింగ్‌, ఇతర పనులతో బిజీబిజీగా ఉన్న ఆయనకు డీఈఓ అదనపు బాధ్యత మరింత భారంగా మారింది. అయితే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు రోజులుగా అత్యవసర ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై పలు రకాల విమర్శలు ఉన్న నేపథ్యంలో ప్రతీ ఫైలును క్షుణ్ణంగా చదివితే కానీ సంతకం పెట్టని పరిస్థితి ఉందని చర్చ. ప్రతీ ఫైలుకు సంబంధిత సూపరింటెండెంట్‌, ఇతర అధికారుల పరిశీలన సంతకం తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే తన వద్దకు ఫైలు తీసుకు రావాలని అదనపు కలెక్టర్‌ చెబుతున్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో పదో తరగతి పరీక్షలు, విద్యాశాఖకు సంబందించిన అనేక కార్యక్రమాలు, ప్రణాళికలు ఉన్నందున జిల్లాకు పూర్తి స్థాయి డీఈఓ అవసరం తప్పనిసరి అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

అదనపు కలెక్టర్‌కు డీఈఓగా అదనపు బాధ్యతలు

ఆర్థిక లావాదేవీల రికార్డులపై ఆచీతూచీ

అత్యవసర ఫైళ్లకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement