ప్రభుత్వం సూచించిన ధరలకే విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం సూచించిన ధరలకే విక్రయించాలి

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

దంతాలపల్లి: ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు ప్రభుత్వం సూచించిన ధరలకే ఎరువులు విక్రయించాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు కుమ్మరికుంట్ల గ్రామంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ప్రతీ రైతు తప్పకుండా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఎరువులు, విత్తనాల షాపులను తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి లింకులు పెట్టకుండా ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాపుల యజమానులను హెచ్చరించారు. నిషేధిత గడ్డిమందులు విక్రయించొద్దని సూచించారు. దంతాలపల్లి సర్పంచ్‌ బాలాజీ, మండల వ్యవసాయ అధికారి వాహిని, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉదయ్‌ కిరణ్‌, హర్షవర్ధ్దన్‌, ఆమని, రైతులు పాల్గొన్నారు.

యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి

మహబూబాబాద్‌: మీ ప్రమాణం యాప్‌లో ఉద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ యుగేంధర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం యాప్‌ వినియోగం తదితర విషయాలపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా యుగేంధర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ప్రతీ ఒక్కరు మీ ప్రమాణం యాప్‌లో వివరాలు నమోదు చేసుకుని ముఖచిత్రం హాజరు వేయాలన్నారు. యాప్‌ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సందేహాలను నివృత్తి చేయడానికే శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ టెక్నికల్‌ సిబ్బంది అశోక్‌, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

పీఎం సూర్యఘర్‌పై అవగాహన శిబిరాలు

నెహ్రూసెంటర్‌: పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌బిజ్లీ ప్రయోజనాలపై నేటి నుంచి ఈ నెల 3వ తేదీ వరకు జిల్లా సర్కిల్‌ కార్యాలయం, తొర్రూరు డివిజన్‌ కార్యాలయంలో అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కె.దర్శన్‌కుమార్‌, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్‌ రాజేందర్‌ బుధవారం తెలిపారు. శిబిరాల్లో రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, విద్యుత్‌ బిల్లుల తగ్గింపు, నెట్‌ మీటరింగ్‌ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. సోలార్‌ విక్రేతలు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొని రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు విధానం, బ్యాంకు రుణసౌకర్యాలు, అధిక సహాయం, పథకం అమలు సంబంధించిన అంశాలను వివరిస్తారని పేర్కొన్నారు. గృహ విద్యుత్‌ వినియోగదారులు, రెసిడెంట్స్‌, వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఆసక్తి ఉన్న ప్రజలు మూడు రోజులు శిబిరాలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యాలు పెంచాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యాలు పెంచాలని ఇన్‌చార్జ్‌ డీఈఓ మందుల శ్రీరాములు అన్నారు. మానుకోట మున్సిపల్‌ పరిధిలోని మోడల్‌ స్కూల్‌లో బుధవారం ఏఎక్స్‌ఎల్‌ ఏఐపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ శ్రీరాములు హాజరై మాట్లాడుతూ.. ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ ఏఎఫ్‌ఎల్‌ఎన్‌ నిర్దేశించిన అభ్యసన లక్ష్యాలు విద్యార్థులు సాధించేలా కంప్యూటర్‌ ఆధారిత బోధన, ఏఎక్స్‌ఎల్‌ ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయి గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా బోధన ప్రణాళికలను రూపొందించాలన్నారు. అనంరతం అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి మోత్కూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, సీఎంఓ సురేశ్‌, డీఆర్పీలు నాగముని, యాదగిరి, ఉషారాణి, జగన్‌, అమితాబ్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement