మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్ నిర్వహించారు. వందేమాతరం గేయంతో కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు స్పీకర్, ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా నిర్వహించారు. విద్యా పురోగతి, దేశంలో సమస్యలపై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదించడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల విమర్శలతో చర్చ వాడివేడిగా జరిగింది. ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలు, న్యాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి మాక్ పార్లమెంట్ నిర్వహించడం బాగుందన్నారు. విద్యార్థులు ఖాళీ సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించాలన్నారు. మాక్ పార్లమెంట్‌లో రాష్ట్రస్థాయికి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని, వారు ప్రతిభ చాటాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఈఓ మందుల శ్రీరాములు, డీఎస్‌ఓ అప్పారావు, ఏఎంఓ వెంకటేశ్వర్లు, కన్వీనర్లు ఉపేందర్‌రావు, జిల్లా సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, గైడ్ టీచర్లు యాకూబ్‌నాయక్, సునీత, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్


