న్యూస్‌రీల్
‘నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి మల్లారెడ్డి గత ఏడాది తనకున్న నాలుగు ఎకరాల్లో వరి, పత్తి పంటలు వేశాడు. భారీ వర్షాలతో పత్తి జాలువారింది. ధాన్యం అమ్మేందుకు ఇబ్బందులు పడ్డా.. పెట్టుబడులకే సరిపోయాయి. వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది మొత్తం నాలుగు ఎకరాల్లో పెసర సాగుచేశాడు. పంట చేతికి వచ్చింది. అమ్మితే రూ.1.50లక్షలు వచ్చాయి. పెట్టుబడి రూ.30వేలు పోగా, రూ.1.20లక్షలు మిగిలాయాని మల్లారెడ్డి చెప్పాడు.’
‘పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు బయ్యారం మండల కేంద్రానికి చెందిన సుంకర రాజు. తనకున్న పది ఎకరాల్లో గత ఏడాది పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగుచేశాడు. అయితే గతేడాది యూరియా కొరత, ఇతర పెట్టుబడులు, మిర్చి పంటకు నల్లి పురుగు ఆశించడంతో పంటచేతికి రాకుండా రూ.2లక్షల మేరకు అప్పులు మిగిలాయి. ఈ ఏడాది పదెకరాల్లో పెసర పంటసాగు చేయగా, 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.6,500 చొప్పున విక్రయించగా రూ.2.60లక్షలు వచ్చాయి. ఇందులో ఖర్చులు రూ.1.60లక్షలు పోను రూ.లక్ష మిగిలినట్లు రాజు సంతోషం వ్యక్తం చేశాడు’.


