మహబూబాబాద్ అర్బన్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళిత కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు ఆర్థిక అభివృద్ధిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ పథకం అమలు చేస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ఈ పథకం ద్వారా మేకలు, గొర్రెలు, గేదెల పెంపకం, కిరాణా, కూరగాయల వ్యాపారం, ఇటుకల తయారీ, చెప్పుల షాపులు, టెంట్‌హౌస్, క్లాత్‌స్టోర్స్ తదితర వ్యాపారాల కోసం అందించే రుణాల నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
గతంలో పెండింగ్..
2018–2019 ఆర్థిక సంవత్సరంలో పలు యూనిట్లు గ్రౌండింగ్ కాలేదు. 2020–21ఆర్థిక సంవత్సరం 301 యూనిట్లు కేటాయించారు. వీటి విలువ సుమారు రూ.4.86కోట్లు ఉంటుంది. యూనిట్లు స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసినవి కాగా.. సబ్సిడీ విషయంలో ఎలాంటి మార్పులేదు. అయితే ప్రభుత్వం ఆగమేఘాల మీద 9యూనిట్లకు మాత్రమే రూ.13.29లక్షల ప్రణాళిక విడుదల చేసింది. మిగితా వారికి నిధులు విడుదల చేయలేదు.
2025–26సంవత్సరంలో
1,726 దరఖాస్తులు..
2025–26ఆర్థిక సంవత్సరంలో రూ.3.37కోట్ల ఎస్సీ రుణాల నిధులు కేటాయించారు. 6 నెలల క్రితమే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లా వ్యాప్తంగా 1,726 మంది ఎస్సీ యువత దరఖాస్తు చేసుకుంది. కాగా, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో అర్హులైన వారిని ఎంపిక చేసి జాబితాను బ్యాంకులకు పంపాలి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ జరగలేదు. ఎంపిక కోసం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.
ఎస్సీ రుణాల పంపిణీలో జాప్యం
లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ
జిల్లాలో 1,726 దరఖాస్తులు


