నేటి నుంచి పండుగ ప్రారంభం.. తొమ్మిది రోజులపాటు వేడుకలు
గూడూరు: బొడ్డెమ్మ.. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీక. ఇది ప్రకృతిని పూజించే పండుగ. మట్టి, పూలతో జరుపుకునే మహత్తర వేడుక. బతుకమ్మకు తొమ్మిది రోజుల ముందు వచ్చే బొడ్డెమ్మ వేడుక ప్రధానంగా మహిళలు ఆనందంగా ఆడిపాడే పెద్ద పండుగ. బొడ్డే అంటే అర్థం ‘చిన్న కుప్ప, బిడ్డల అమ్మ బొడ్డెమ్మ లేదా చిన్న అమ్మాయి’. ఈ పండుగను ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలో మహాలయ అమావాస్యకు ముందు బహుళ పంచమి (గురువారం) నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.
చెరువు, ఏరు లాంటి ప్రదేశాల్లోని పుట్టమట్టిని తీసుకొచ్చి చెక్కపీటపై చతురస్రాకారంగా ఐదు దొంతరులుగా.. ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. బొడ్డెమ్మను రుద్రాక్ష, మల్లె, బీర, కాకర, కట్ల, జాజి పూలతో అలంకరిస్తారు. పై శిఖర ప్రదేశంలో బియ్యంతో నిండిన చిన్న కలశంలో బియ్యం నింపి పెడతారు. కొత్త వస్త్రం పెడతారు. తమలపాకుపై పసుపు గౌరమ్మను ఉంచుతారు. బొడ్డెమ్మను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంబరంగా జరుపుకుంటారు. మొదటి రోజు బొడ్డెమ్మ ఆడే మహిళలు తమ ఇంటి ఎదుట అలికి, ముగ్గుపెడుతారు. ఆ తర్వాత వారు ఎంచుకున్న దేవాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద కల్లాపి చల్లి, ముగ్గులు పెట్టిన చోట బొడ్డెమ్మ పీటను ప్రతిష్ఠించి పూజలు ప్రారంభిస్తారు.
మహిళలు బొడ్డెమ్మ చుట్టు తిరుగుతూ బొడ్డెమ్మ బొడ్డెమా.. కోల్ బిడ్డాలెందరూ కోల్ అంటూ పాటలు పాడుతారు. చివరగా శిఖర భాగంలో రాగి చెంబులో పోసిన బియ్యం, పప్పు, బెల్లం, దినుసులను నైవేద్యంగా తయారు చేసి అందరికీ ప్రసాదంగా పంచుతారు. తొమ్మిదో రోజు బొడ్డెమ్మ పీటను నాలుగు చక్రాల వాహనంపై అన్ని రకాల పూలతో అలంకరిస్తారు. చిన్నాపెద్ద తేడాలేకుండా మహిళలు, యువతులు కోలాటమాడుతూ సమీప చెరువులు, వాగులు, బావుల్లో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మ సంబరాల తర్వాత పిత్రు(పెత్రమాస) అమావాస్య రోజు ఈ నెల 10వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.
మహిళల ఆటపాటలతో
అంబరాన్నంటనున్న సంబరాలు
సందడిగా మారనున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాలు


