కాశిబుగ్గ: వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ప్రైవేట్ ల్యాబ్‌ల దందా ఆగడం లేదు. ముఖ్యంగా క్యాజువాలిటీలో అత్యవసర సేవల కోసం వచ్చే పేషెంట్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ రక్త పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. క్యాజువాలిటీలోని కొంతమంది వైద్యులు ఈ దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ల ద్వారా ప్రైవేట్ ల్యాబ్‌లకు సమాచారం అందిస్తూ పేషెంట్ల వివరాలు చేరవేస్తున్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపనలు వినిపిస్తున్నాయి.
అత్యవసర సేవల కోసం పేషెంట్లు రాగానే..
అసలే పేద రోగులు. ఆపై దూర ప్రాంతాల నుంచి అత్యవసర సేవల కోసం వస్తే ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు. ఇరుకై న క్యాజువాలిటీలో చికిత్స చేయడం వైద్యులకు కష్టమే. అయినా ఇబ్బందులు సాధారంగా మారుతున్నాయి. అయితే చాలా మంది పేషెంట్ల వైద్య సేవల్లో భాగంగా ముందుగా డాక్టర్లు రక్త పరీక్షల కోసం పంపుతుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు వైద్యులు రక్త పరీక్షల పేరుతో ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుని ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మీ పేషెంటుకు సంబంధించిన రక్త పరీక్ష ఉండదని, ఉన్నా కూడా రిపోర్టు త్వరగా రాదంటూ అటెండెంట్లను భయపెడుతుంటారు.దీంతో గత్యంతర లేక ప్రైవేట్ అయినా పర్వాలేదు.. తమకు మంచి వైద్యం కావాలంటూ అటెండెట్లు పరోక్షంగా బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సదరు వైద్య సిబ్బంది ప్రైవేట్ ల్యాబ్‌ల అడ్రస్ చెప్పుతూ అక్కడికి శాంపిల్స్ పంపుతుంటారు. కొన్ని సమయాల్లో ప్రైవేట్ ల్యాబ్ సిబ్బందినే క్యాజువాలిటీకి రప్పించి బ్లడ్ శాంపిల్స్ తీసుకునే ఏర్పాట్లు చేయిస్తారు. బ్లడ్ పరీక్షల్లో కొంత పర్సంటేజీ చొప్పున కమీషన్లు ఫోన్ పే ద్వారా తీసుకుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రక్తపరీక్షల పేరుతో దోపిడీ..
గతంలో ఎంజీఎంకు సంబంధించిన రిక్విజేషన్ లెటర్‌పై పరీక్షలు రాసి ఇచ్చి పంపేవారు. వీటిపై అధికారులు కఠినం చేయడంతో తెల్లకాగితాల మీదే పరీక్షల వివరాలు రాసిస్తూ రక్త పరీక్షల పేరుతో అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రక్త పరీక్ష దందాపై పత్రికల్లో వచ్చిన ఒకటి రెండు రోజులు ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది ఎంజీఎం దరిదాపుల్లోకి రారు. మళ్లీ మూడో రోజు తమ దందా షురూ చేస్తారు. సమాచారం అక్కడ ఉన్న పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి తెలిసినా తమకెందుకులే అనే ధోరణిలో ఉంటున్నట్లు సమాచారం. అయితే వారిపై కఠినంగా వ్యవహరిస్తే చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ల్యాబ్ దందాకు తెరపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్యాజువాలిటీని సందర్శించిన ఆర్‌ఎంఓ..
ఎంజీఎంలో పేషెంట్ల నుంచి ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది రక్త నమూనాలు సేకరిస్తున్నారని సమాచారం తె లుసుకున్న ఆర్‌ఎంఓ–1 అబ్బు మధుకర్ యాదవ్ బుధవారం క్యాజువాలిటీని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది ఇక్కడకు రావడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న సె క్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అలా జరిగితే ఊరుకునేది లేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్తానని హెచ్చరించారు. ఎంజీఎంకు ప్రైవేట్ సిబ్బంది వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎంజీఎం క్యాజువాలిటీలో
కొనసాగుతున్న రక్తపరీక్షలు
హాస్పిటల్ పరిసరాల్లోనే టెక్నీషియన్ల సంచారం


