రైతు సేవలో ముల్కనూరు సొసైటీ | - | Sakshi
Sakshi News home page

రైతు సేవలో ముల్కనూరు సొసైటీ

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

భీమదేవరపల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా దేశంలోని సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచింది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్‌ సొసైటీ. 1956లో కొద్దిమంది రైతులతో ప్రారంభమైన ఈ సొసైటీ నేడు వేలాది మంది రైతులకు విస్తృత సేవలు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతు సంక్షేమం, సహకార రంగంలో అందిస్తున్న సేవలకు ముల్కనూరు సొసైటీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుంది. సోమవారం 70వ వార్షికోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం

7,464 మంది సభ్యులకు సేవలు..

ముల్కనూరు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని సొసైటీకి బలమైన పునాది వేశారు. అప్పట్లో రూ.100తో ప్రారంభమైన సంస్థ క్రమంగా అభివృద్ధి చెంది నేడు 42,663 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే స్థాయికి చేరుకుంది. సుమారు 144 మంది ఉద్యోగులతో 14 గ్రామాల్లో 7,464 మంది సభ్యులకు సేవలందిస్తోంది.

రైతే రాజు.. ఇదే సొసైటీ లక్ష్యంగా..

రైతులకు సొసైటీ పంట రుణాలు, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తోంది. అంతేకాకుండా పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, విద్యుత్‌ మోటార్లు, పైపులైన్లకు రుణ సాయం అందిస్తోంది. పాడిపశువులు, గొర్రెలు, ట్రాక్టర్ల కొనుగోళ్లకు సైతం ఆర్థిక సహకారం అందిస్తోంది. రైతు పండించిన ధాన్యం, పత్తిని సొసైటీ కొనుగోలు చేస్తోంది. సొసైటీ వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చే నికర లాభాలు 2026లో సుమారు 7.22 కోట్లు రైతుల సంక్షేమానికి వినియోగించడం ప్రత్యేకతగా నిలిచింది. ఏటా విజ యదశమి సందర్భంగా లాభాల్లో కొంత భాగాన్ని బోనస్‌ రూపంలో సభ్యులకు అందిస్తోంది.

ఎరువుల కొరత లేకుండా..

ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులకు ఎరువుల కొరత రాకుండా సొసైటీ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఏటా సుమారు రూ.6 కోట్ల విలువైన ఎరువులను నిల్వ ఉంచి అవసరమైన సమయంలో రైతులకు అందుబాటులో ఉంచుతోంది. సొసైటీ పరిధిలోని గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి రైతులకు గ్రామస్థాయిలోనే ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను అందిస్తోంది.

సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా సొసైటీ గుర్తింపు

సొసైటీ నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, శుద్ధిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1965లో ప్రారంభమై న విత్తన శుద్ధి కార్యక్రమం క్రమంగా విస్తరించి అ త్యాధునిక విత్తన శుద్ధి కర్మాగారాల స్థాయికి చేరింది. నాణ్యమైన వరితో పాటు మొక్కజొన్న విత్తనాల ను కూడా రైతులకు అందిస్తుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక ప్రాంతా ల రైతులు సైతం ముల్కనూరులో తయారయ్యే వి త్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అందుకే సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా ముల్కనూరు సొసైటీని కీర్తిస్తారు.

వృద్ధ రైతులకు పింఛన్‌ సౌకర్యం

రైతులు వృద్ధాప్యంలోకి చేరినప్పుడు ఆర్థిక భరోసా కల్పించేలా పింఛన్‌ సదుపాయం, ప్రమాదవశాత్తు సభ్యుడు మృతిచెందినప్పుడు కుటుంబానికి ఆర్థిక సాయం, అంత్యక్రియలకు సాయం, పంట రుణాల మాఫీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

విద్య, వైద్య రంగాలకు పెద్దపీట

రైతు కుటుంబాల్లో విద్య, వైద్యానికి సొసైటీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. సభ్యుల పిల్లలకు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ప్రోత్సాహకాలు, ఉపకార వేతనాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఏకేవీఆర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ద్వారా ఏకేవీఆర్‌ జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాలను నిర్వహిస్తోంది. 2008 నుంచి 2026 వరకు సుమారు 1200 మంది పైగా విద్యార్థులకు రూ. కోటికి పైగా ఉపకార వేతనాలు అందించినట్లు సొసైటీ వివరించింది. ఉన్నత విద్యలో బీటెక్‌, ఎంబీబీఎస్‌ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సైతం ఆర్థిక సహాయం అందిస్తోంది. అదేవిధంగా సభ్యులు, వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణకు సొసైటీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. సూపర్‌బజార్‌ ఆవరణలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాల ద్వారా వేలాది మంది సభ్యులకు కంటి పరీక్షలు చేయించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించింది. ఇందుకోసం సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సొసైటీ వివరించింది.

ప్రముఖుల సందర్శన..

ముల్కనూరు సొసైటీని ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికా రులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సొసైటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు జీవితాంతం సభ్యుడిగా ఉండడం సంస్థ చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ సొసైటీని సందర్శించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కాశీ విశ్వనాథరెడ్డి కాంస్య విగ్రహాన్ని అప్పటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ ఆవిష్కరించారు.

1956లో రూ.100తో

ప్రారంభం.. ఒక ఉద్యోగితో సేవలు

2026లో రూ.42,663 కోట్లకు పైగా లావాదేవీలు

నేడు ముల్కనూరు సొసైటీ

70వ వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement