● డంపింగ్ యార్డులో వేరు చేయని వ్యర్థాలు
● నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
● ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ
తొర్రూరు
మున్సిపాలిటీ సమాచారం
నిత్యం
సేకరించే చెత్త:
15 టన్నులు
చెత్త సేకరణ ఆటోలు: 6
జనాభా
30 వేలు
తొర్రూరు: అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల లక్షల ఆదాయం మంటల్లో కాలిపోతోంది. మున్సి పాలిటీకి ఆదాయం తెచ్చి పెట్టాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. గృహాల నుంచి పారిశుద్ధ్య సిబ్బంది ట్రాక్టర్లు, ట్రాలీల ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నా.. సెగ్రిగేషన్ షెడ్‌లో చెత్తను వేరు చేయని కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. దాని స్థానంలో చెత్తను తగులబెట్టడం ద్వారా వెలువడుతున్న పొగ, విష వాయువులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలుష్యం పెరుగుతోంది. ప్రత్యామ్నాయంగా బయోమైనింగ్ (చెత్తను వనరుగా మార్చే) విధానం అమలుకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
వ్యర్థాలను వేరు చేస్తేనే..
తొర్రూరు పట్టణంలో 16వార్డులు ఉండగా 60 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. రోజు సుమారు 15 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. దానిని పట్టణ శివారులోని హచ్చుతండా సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పట్టణంలో 30 వేల జనాభా ఉండగా అందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ పకడ్బందీగా చేపట్టాలని భావించినా క్షేత్రస్థాయిలో అమలుకు ఆటంకం కలుగుతోంది. ప్రజలు తడి, పొడి వ్యర్థాలన్ని ఒకే డబ్బాలో పోసి సిబ్బందికి అందజేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డుకు అలాగే తరలిస్తున్నారు. యార్డులో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయి అనేక అనర్థాలకు దారితీస్తోంది. సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగం చేసి ఎరువులు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీదే. నిత్యం సేకరించే చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. దాన్ని విక్రయించి సంపద సృష్టించాలి. ఈ మేరకు రూ.6 నుంచి రూ.10 లక్షలు ఒక్కో సెగ్రిగేషన్ షెడ్డుకు వెచ్చించి మూడు కేంద్రాలు నిర్మించారు. కొద్ది రోజులకే వాటిని నిరుపయోగంగా మార్చారు. సెగ్రిగేషన్ షెడ్లలో తడి, పొడి చెత్త, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వంటి వస్తువులు, గాజు సీసాలు రీ సైక్లింగ్ చేసి విక్రయిస్తే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. డంపింగ్ యార్డు ఖాళీగా మారుతుంది. వర్మీ కంపోస్టు ద్వారా తడి చెత్తను ఎరువుగా మారిస్తే ఉద్యాన తోటలు, నర్సరీలకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఒక కిలో రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయించవచ్చు. టన్నుకు మించి తీసుకువెళ్తే రూ.3వేల వరకు విక్రయించే వీలుంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యక్తులు ప్లాస్టిక్‌తో పాటు అవసరమైన వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. బయట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
కానరాని బయో మైనింగ్..
మున్సిపాలిటీలో బయో మైనింగ్ ఏర్పాటు లేక చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. ఇది ఏర్పాటైతే చెత్తను ప్రాసెసింగ్ చేయనున్నారు. దీంతో తయారయ్యే ఎరువు పంట పొలాలకు బలాన్నిస్తుంది. కంపోస్టబుల్ పదార్థాలు సిమెంట్ పరిశ్రమల్లో వాడకానికి అవసరమవుతాయి. ఇన్నర్ట్ మెటీరియల్‌ను భారీ గుంతలు పూడ్చేందుకు ఉపయోగించవచ్చు. చెత్త నుంచి ఈ ప్రాసెసింగ్ పూర్తయితే ఆ స్థలం ఖాళీ అవుతుంది. శుద్ధి అవుతుంది. దీనిపై ఎలాంటి ముందడుగు లేకపోవడంతో చెత్త పేరుకుపోతోంది.
స్వచ్ఛ పట్టణంగా మారుస్తాం
తొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. నిత్యం చెత్త సేకరణ చేపడుతున్నాం. బయో మైనింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతాం. చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు కృషి చేస్తాం.
–వక్కల శ్యామ్‌సుందర్, మున్సిపల్ కమిషనర్
పారిశుద్ధ్య సిబ్బంది
60
వార్డులు 16
డంపింగ్ యార్డు పొగ...తండాపై పాగా
డంపింగ్ యార్డు హచ్చుతండా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యార్డు నుంచి దుర్వాసన వస్తుండడంతో తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం పోగవుతున్న టన్నుల కొద్ది వ్యర్థాలతో పర్యావరణం కలుషితమవుతోంది. పేరుకుపోయిన వ్యర్థాలు కుళ్లిపోయి రసాయనాలు విడుదల చేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తకు సిబ్బంది నిప్పు పెడుతుండడంతో మంటలు చెలరేగి తండావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై పలుమార్లు గిరిజనులు ఆందోళనలు చేపట్టారు.


