సాక్షి, మహబూబాబాద్: ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా ప్రజల నాడి తెలుసుకునేందుకు రాజ కీయ పార్టీలు సర్వే బాట పట్టినట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గాల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి ఈ ఏడాది సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సర్వేలు పూర్తి కాగా, తాజాగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వేలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పనితీరు గతంలో ఎలా ఉండేది.. ఇద్దరిలో ఎవరు, ఏ ప్రభుత్వం బెటర్.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ నేత బరిలో ఉంటే ఓటేస్తారు.. అంటూ సుమారు పదిహేను వరకు ప్రశ్నలు అడుగుతున్నట్లు చర్చ.
ప్రతికూల, అనుకూల పరిస్థితులు..
ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు చేయించుకున్న సర్వేలో ప్రతికూల, అనుకూల పరిస్థితులు ఎదురయ్యాయి. వీటి ఆధారంగానే జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్థితి బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని, ప్రజల్లో ఉండాలని, చేసిన పనులు, సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించినట్లు తెలిసింది. అదే విధంగా ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండవద్దని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీల విస్మయం, ప్రజా సమస్యలే ఎజెండాగా తీసుకొని ప్రజల్లోనే ఉండాలని, నియోజకవర్గాల్లో క్యాడర్‌ను కాపాడుకున్నవారికే భవిష్యత్ ఉంటుందని బీఆర్‌ఎస్ అధినాయకులు చెప్పినట్లు తెలిసింది.
మళ్లీ గెలుస్తాం కాంగ్రెస్.. అధికారం మాదే బీఆర్‌ఎస్
అంతర్గతంగా ఎలా ఉన్నా.. బహిర్గతంగా మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని.. మళ్లీ గెలుపు మాదే అని కాంగ్రెస్ క్యాడర్ చెబుతోంది. గత ఎన్నికలకు భిన్నంగా తీర్పు ఉంటుందని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. అదే విధంగా గెలిచిన నాటి నుంచి కింది క్యాడర్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం, కొందరికే ప్రాధాన్యం ఇవ్వడం వంటి విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. గత కొద్దిరోజులుగా కార్యకర్తల దగ్గరకు వెళ్లడం, మీ మేలు మర్చిపోను, మరోసారి గెలిపించాలి.. మీ సహకారం కావాలి అని నాయకులతో మమేకమై మాట్లాడుతున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. కొంతకాలం మౌనంగా ఉన్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు కూడా వేగం పెంచడం, అనుచరులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయడం, క్యాడర్‌తో మాట్లాడడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
డీలిమిటేషన్‌పై ఆశతో ప్రధాన నాయకులు
ఒక వైపు అఽధికార, ప్రతిపక్ష నాయకుల పనితీరుపై సర్వేలు నిర్వహించడం, పంథాలు మార్చుకొని వ్యవహరిస్తుంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ప్రధాన నాయకులు మాత్రం డీలిమిటేషన్‌పై ఆశలు పెట్టుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు అర్థం అవుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపీ, ఓ ప్రధాన నాయకుడు జనరల్ స్థానాలతోపాటు, ఎస్టీ స్థానంలో తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు స్థానిక క్యాడర్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బీఆర్‌ఎస్‌లోని మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, యువజన నాయకులు, డాక్టర్లు కూడా తమతోపాటు, తమ కుటుంబ సభ్యులు, వారసులకు అవకాశం రావాలంటే డీలిమిటేషన్ కావాలని.. ఎలా అయితే లాభం అనే కోణంలో అనుచరులతో చర్చలు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా రాజకీయ చర్చలు వేడెక్కితే.. రాబోయే రోజుల్లో మరింత వేడి పుంజుకుంటుందని స్పష్టం అవుతుంది. మున్ముందు ఏం జరుగుతుందో.. ఏ పార్టీ నుంచి ఎవరూ పోటీకి సిద్ధం అవుతారో.. ఎవరికి ఏ అవకాశం వస్తుందో అనేది వేచి చూడాల్సిందే.
ఎమ్మెల్యేల పనితీరుపై మొదలైన చర్చ
ఎవరు బెటర్ అని ప్రశ్నలు వేసి ఆరా
డీలిమిటేషన్‌పై ఆశతో
ప్రధాన నాయకులు
జోరందుకున్న రాజకీయ చర్చలు


