ఇక యూజర్‌ చార్జీలు | - | Sakshi
Sakshi News home page

ఇక యూజర్‌ చార్జీలు

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు వాహనాల తరచూ మరమ్మతుల బారిన పడుతుండడంతో పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది. అయితే సమస్య పరిష్కారం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా కమర్షియల్‌ ప్రాంతాల్లో యూజర్‌ పన్నులు వసూలు చేసేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానం అమలు కోసం రెండు కొత్త ట్రాక్టర్ల కొనుగోలు చేసేందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేశారు.

141మంది మాత్రమే..

మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా లక్ష వరకు జనాభా ఉంది. కాగా, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెరగడం లేదు. సీడీఎంఏ ఆదేశాల ప్రకారం ఆదాయం పెంచుకుని కార్మి కుల సంఖ్య పెంచుకోవాలి. అయితే ఆదాయం అంతంతే ఉండడంతో కార్మికుల సంఖ్యపెంపుపై దృష్టి పెట్టడం లేదు. మున్సిపాలిటీలో 143మంది కార్మికులు ఉండగా.. ఇటీవల ఇద్దరు మృతి చెందగా ప్రస్తుతం 141మంది మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉండగా 141మందిలో ప్రతీరోజు పలు కారణాలతో 15 నుంచి 20 హాజరు కావడం లేదు. అలాగే ఉన్న వారిలో 8 మంది వీఐపీ ఇళ్లలో పని చేస్తున్నారు. దీంతో సమస్య తీవ్రంగా మారింది.

వాహనాల రిపేర్లు..

మున్సిపాలిటీలో కాల్వలు శుభ్రం చేసే మిషన్‌, రోడ్డు స్వీపింగ్‌ మిషన్‌, వైకుంఠరథం, 14 మూడు చక్రాల ఆటోలు, 19నాలుగు చక్రాల ఆటోలు, 11 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. రెండు చెత్త డంపింగ్‌యార్డులు ఉన్నా యి. సుమారు రూ.86లక్షలతో కొనుగోలు చేసిన కాల్వలు శుభ్రం చేసే మిషన్‌, రోడ్డు స్వీపింగ్‌ మిషన్‌ నిర్వహణపై అవగాహన లేక వాడడం లేదు. ఉన్న వాహనాల్లో సగానికిపైగా తరచూ మరమ్మతులతో షెడ్డులకే పరిమితమవుతున్నాయి.

పలు వార్డులకు వారానికి రెండుసార్లే..

పట్టణంలోని 22వ వార్డుతో పాటు పలు వార్డులకు వారానికి రెండుసార్లు మాత్రమే చెత్త సేకరణ వాహనాలు వెళ్తున్నాయి. కాగా, ఆ వార్డుల ప్రజలు రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య సమస్య జఠిలమైంది. కేవలం కమర్షియల్‌ సెంటర్లలో మాత్రమే రోజుకు రెండుసార్లు చెత్త సేకరిస్తున్నారు.

కమర్షియల్‌పై నజర్‌..

కమర్షియల్‌ ప్రాంతాల్లో ఎక్కువ చెత్త వేసే సంస్థలపై అధికారులు దృష్టిపెట్టారు. ఆయా సంస్థల నుంచి యూజర్‌ చార్జీల పేరుతో ప్రతీనెల అదనంగా పన్నులు వసూలు చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగా సుమారు 59 ఆస్పత్రులు, 35 హోటళ్లు, 3 సినిమా థియేటర్లు, 2 ప్రైవేట్‌ హాస్టళ్లు, కర్రీ పాయింట్లు, బార్లు, రెస్టారెంట్లపై దృష్టి పెట్టారు.

పన్నులు ఇలా..

బెడ్స్‌ లేని చిన్న ఆస్పత్రి అయితే నెలకు రూ.1000, బెడ్స్‌తో ఉన్న ఆస్పత్రి రూ.3000, సినిమా థియేటర్‌ రూ.1500, హోటలు రూ.400, టిఫిన్‌ సెంటర్‌ రూ.250, ప్రైవేట్‌ హాస్టల్‌ రూ.600, రెస్టారెంట్‌ రూ.500, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు రూ.1000గా నిర్ణయించారు. కర్రీ పాయింట్లు, ఇతర షాపులకు కూడా నిర్ణయించారు.

నోటీసులు జారీ..

మున్సిపల్‌ అధికారులు నోటీసులు తయారీ చేస్తున్నారు. వాటిని రెండు రోజుల్లో అందజేసి వచ్చే నెల నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయనున్నారు. తద్వారా వచ్చిన ఆదాయంతో రెండు ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లిస్తామని అధికారులు భావిస్తున్నారు.

యజమానులు సహకరించాలి

యూజర్‌ చార్జీల విషయంలో డాక్టర్లు, హోటళ్ల యజమానులు అందరూ సహకరించాలి. దీంతో ఆదాయం కొంత పెరగడంతో పాటు వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. కొత్త ట్రాక్టర్లకు ఈఎంఐ వెసులుబాటవుతుంది.

– వినోద్‌కుమార్‌, కమిషనర్‌

కమర్షియల్‌ ప్రాంతాల్లో చెత్తసేకరణకు అదనపు వసూలు

మానుకోట మున్సిపాలిటీ ఆదాయం

పెంపుపై దృష్టి

నోటీసుల తయారీలో సిబ్బంది నిమగ్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement