మానుకోట మున్సిపాలిటీలో సక్రమంగా అమలు కాని సిటిజన్ చార్ట్
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో సిటిజన్ చార్ట్ సక్రమంగా అమలు కావడం లేదు. సిటిజన్ చార్ట్ బోర్డులో 21రకాల సర్టిఫికెట్లు, అనుమతులు ఇచ్చే గడువు పొందుపర్చి ఉంటాయి. ఈమేరకు దరఖాస్తుదారులు ప్రశ్నిస్తారని, వాదిస్తారని అధికారులు బోర్డు కనపడకుండా మూలన ఏర్పాటు చేశారు. అలాగే ప్రక్రియ అంతా ఆన్‌లైన్ కావడంతో అధికారులు పలు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సర్టిఫికెట్లు, అనుమతుల కోసం దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
21 అంశాలు..
సిటిజన్ చార్ట్ బోర్డులో 21 అంశాలు నమోదై ఉంటాయి. ఇంటి నంబర్‌కు 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. మ్యుటేషన్‌కు 15 రోజులు, ఖాళీస్థలం పన్ను, 15 ట్రేడ్‌లైసెన్స్‌లకు వెంటనే, నల్లా కనెక్షన్‌కు 14 రోజులు, జనన, మరణ ధ్రువ పత్రాలు 21రోజులు, బై నంబర్లకు 15 రోజుల్లో సరిఫికెట్లు జారీ చేయాలి. ఆ బోర్డులో పొందుపర్చిన విధంగా గడువు లోపు సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంది.
రెండు ఇళ్ల అనుమతులు మాత్రమే పెండింగ్..
ఆన్‌లైన్ ప్రక్రియ కావడంతో ఏ సెక్షన్‌కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు ఇళ్ల అనుమతులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్, ఇంటి నంబర్ల విషయంలో పెద్ద సమస్య ఉందని, వాటి మంజూరులో మాత్రమే ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
చాలా వరకు తిరస్కరణ..
ఆన్‌లైన్ ప్రక్రియ కావడంతో సంబంధిత ఉన్నతాధికారులతో సమస్య ఉంటుందని చాలా దరఖాస్తులను పలు కారణాలతో తిరస్కరిస్తున్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు.
అన్ని గడువులోగా క్లియర్ చేస్తున్నాం
సర్టిఫికెట్లు, అనుమతుల తదితర విషయాల్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఏమీ పెండింగ్‌లో లేవు. ఇంటి నంబర్ల విషయంలో ఆచితూచి అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. ఇంటి నంబర్ల సమస్య మాత్రం ఉంది.
– ఎం.వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
సకాలంలో అందని సర్టిఫికెట్లు
మున్సిపల్ కార్యాలయం
చుట్టూ ప్రజల ప్రదక్షిణలు
ఆన్‌లైన్ ప్రక్రియలో అధికారుల జిమ్మిక్కులు
పలు కారణాలతో దరఖాస్తుల తిరస్కరణ
లక్ష జనాభా..
మానుకోటకు సమస్యల కోటగా పేరుంది. ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడంతో సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అధిక సంఖ్యలో గృహాల నిర్మాణాలు జరిగాయి. అనుమతులు, ఇంటి నంబర్ల మంజూరు విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. ఉద్యోగం, విద్య, వ్యాపారం రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది.


