మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు సైన్స్‌పై పట్టు సాధించాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్‌లో బుధవారం జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల శ్రీరాములు మాట్లాడుతూ.. విద్యార్థులు శాసీ్త్రయ అంశాలు, సామాజిక స్పృహ కలిగి నాటక ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులను వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. అనంతరం విజేతలకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యం
గూడూరు: మారుమూల ప్రాంతాల పేదలకు వైద్య సేవలందించడమే లక్ష్యమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీ ఆవరణలో బుధవారం ఓఎన్‌జీసీ సంస్థ సహకారంతో అందించిన రూ.కోటి విలువైన నాలుగు అంబులెన్స్‌లను ఆయన ప్రారంభించారు. మహబూబాబాద్‌కు రెండు అంబులెన్స్‌లు, నెల్లికుదురుకు ఒకటి, గూడూరుకు ఒకటి కేటాయించారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వీరన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, తహసీల్దార్ నాగభవాని, ఓఎన్‌జీసీ హెచ్‌ఆర్ ఎం.శ్రీనివాస్‌గౌడ్, ఓఎన్‌జీసీ ఏఎస్‌ఎం కేవీకే రాజురావు, సాత్విక్, రూరల్ అండ్ యూత్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు లింగాల సుధీర్‌రెడ్డి, మేరెడ్డి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ
నర్సింహులపేట: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను బుధవారం సాయంత్రం మండల ప్రత్యేకాధికారి, డీపీఓ రేవంత్ ఆకస్మికంగా తని ఖీ చేశారు. హాస్టల్‌లో వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు వండుతున్న వంటను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం నోట్‌బుక్స్, బెడ్‌సీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, ఎంపీడీఓ రాంప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌కు సెలవులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో నాలుగు రోజులపాటు క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. మళ్లీ మంగళవారం నుంచి మార్కెట్ పరిధిలో క్రయవిక్రయాలు యథా విధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
మల్బరీ సాగుపై రైతులకు అవగాహన
కేసముద్రం: మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ‘నా పట్టు–నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర సిల్క్‌బోర్డు కర్టాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ శాస్త్రవేత్త జె.శ్రీకాంత్‌నాయక్, సహాయ పట్టు పరిశ్రమ అధికారి కె.సురేశ్ మాట్లాడుతూ.. పంట మార్పిడి ద్వారా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న మల్బరీసాగు చేపట్టి, ఎకరానికి రూ.2లక్షల మేరకు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని రైతులకు వారు సూచించారు.


