న్యూస్‌రీల్
పిల్లల ప్రవర్తనలో
మార్పును గమనించాలి
సాక్షి, మహబూబాబాద్: ‘ఏ తల్లిదండ్రులు అయినా తమ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి.. సమాజంలో గొప్పగా జీవించాలి. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి’ అని ఆలోచిస్తారు. కానీ, కొందరు తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించడంతో నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో వచ్చే మార్పును గమనిస్తూ.. వారి నడవడికపై దృష్టి సారించాలంటున్నారు.. ఎస్పీ శబరీష్. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి ప్రైవేట్ పాఠశా ల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య సంఘటన నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితిపై వివరాలు ఆయన మాటల్లోనే..
మత్తుపదార్థాల రవాణాపై దృష్టి..
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. గతంతో పోలిస్తే జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిర్మూలించాం. సరిహద్దు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, జనగామ జిల్లాల నుంచి రవాణా అవుతున్నట్లు తేలడంతో సరిహద్దుల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిఘా పెట్టాం. దీంతోపాటు ఇటీవలి కాలంలో గంజాయి రవాణా చేస్తున్నవారిని పట్టుకొని కేసులు నమోదు చేశాం.
విద్యార్థులకు అవగాహన సదస్సులు
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు ఎక్కువగా టీనేజీ పిల్లలే బానిసలు కావడం బాధాకరం. అయితే ఒక్క మత్తు పదార్థాలే కాకుండా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి ఘటనలు చోటు చేసుకోకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రధానంగా ప్రతీ పాఠశాల, కళాశాలల్లో మత్తు పదార్థాల నిర్మూలన కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో ప్రిన్సిపాల్, పోలీస్, ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వామ్యులను చేశాం. అనుమానం వచ్చిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పి ప్రవర్తన గమనిస్తూ ఉండాలని చెబుతున్నాం. స్థానిక పోలీస్ యంత్రాంగంతోపాటు, షీ టీమ్, కళాజాతా, మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. యువత మత్తుకు బానిస కాకుండా ఉండటం, చదువుతోపాటు ఆట, పాటలపై దృష్టి సారించాలని క్రీడా కిట్లు అందచేసి వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నాం.
నేరాలు, శిక్షలపై అవగాహన..
నేర ప్రవృత్తికి అలవాటైన వారిలో అందరూ ఒకేలా ఉండరు.. కొందరు స్థానిక పరిస్థితులు, స్నేహితులు, మత్తు పదార్థాలు అందుబాటులో ఉండటం వంటి అంశాలు దోహదపడతాయి. అయితే మత్తు పదార్థాలకు బానిస కావడం, డబ్బులు, జల్సాలకోసం నేరాలు చేసేందుకు కూడా వెనకాడని పరిస్థితి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అసలు నేరాలు చేయకుండా ఉండేలా విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. దీంతోపాటు నేరాలకు పాల్పడితే శిక్షలు ఎలా ఉంటాయి. వాటి ద్వారా భవిష్యత్ ఎలా పాడవుతుంది. ఉద్యోగాలు, ఇతర దేశాల్లో చదువులు మొదలైన సందర్భాల్లో తలెత్తే సమస్యలు, అనారోగ్యం, చిన్నవయస్సులోనే చనిపోవడం వంటి విషయాలపై వివరిస్తున్నారం. మత్తుకు దూరంగా ఉండటం, నేరాల వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ఏది ఏమైనా పిల్లలు చెడిపోవడం బాధాకరం. అయితే మత్తు పదార్థాలు అమ్మేవారు, డబ్బులకోసం పిల్లలను పాడు చేసేవారికి ఒకటే విజ్ఞప్తి.. మీ పిల్లలు అలా అయితే తల్లిదండ్రులు ఎలా బాధపడుతారో మీరు అర్థం చేసుకోవాలి. ఆ పనులు చేసే వారిలో ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం. పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తే తల్లిదండ్రులుగా సమాచారం ఇవ్వండివారి బంగారు భవిష్యత్‌కు పూలబాటలు వేయండి.
వినియోగంపై నిఘా..
గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రణాళికతో వెళ్తున్నాం. కానీ, ఈ మహమ్మారిని అరికట్టడంలో పోలీసు శాఖతోపాటు యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి రావాలి. ప్రజాప్రతినిధుల భాగస్వాయ్యం పెంచేందుకు సర్పంచ్‌లు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశాం. గంజాయికి యువత బానిస కావడం, వారి భవిష్యత్ నాశనం చేసుకోవడం, హెల్మెట్ లేకుండా ప్రయాణంతో మరణాలు, కుటుంబాలు వీధిన పడిన సంఘటనలు వివరించాం. పిల్లల్లో మార్పులు, అలవాట్లలో తేడాలు, డబ్బులు దుర్వినియోగం మొదలైన అంశాలపై పలువురి అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ సమావేశం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రజల్లో అవగాహన పెంచింది. అయితే ఇంకా పెరగాల్సి ఉంది.
మత్తుకు బానిసలు కాకుండా చర్యలు
విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు
ప్రతీ పాఠశాలలో డ్రగ్స్ నిషేధ కమిటీ
‘సాక్షి’తో ఎస్పీ శబరీష్


