మత్తు వల.. మైనర్ల విలవిల | - | Sakshi
Sakshi News home page

మత్తు వల.. మైనర్ల విలవిల

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నచిన్న గొడవలనుంచి తీవ్రమైన నేరాల వరకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మైనర్లు, స్కూల్‌, కాలేజీ విద్యార్థులే గంజాయి ముఠాల టార్గెట్‌గా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ప్రిన్సిపాల్‌ను హత్య చేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో గంజాయి సరఫరా, వినియోగం, యువత ప్రమేయంపై మరోసారి చర్చ మొదలైంది.

స్కూల్‌ వెనుక నుంచి, హాస్టళ్ల వరకు..

వరంగల్‌ నార్కొటిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్లలో 134 గంజాయి కేసులు నమోదవగా, 369 మందిని అరెస్ట్‌ చేశారు. 2,571 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, పట్టణాల శివార్లకే పరిమితమైన గంజాయి వినియోగం క్రమంగా కొన్ని విద్యాసంస్థల పరిసరాలకూ చేరిందన్న ఆందోళన ఉంది. స్కూల్‌ వెనుక ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, చెరువు కట్టలు, రైల్వే పరిసరాలు, కాలేజీ హాస్టళ్లు, అద్దె గదులు.. ఇలా నిర్మానుష్య ప్రాంతాలను కొందరు మత్తు సేవించేందుకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా వరంగల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసిన గంజాయి కేసు మరింత ఆందోళన కలిగించింది. బీటెక్‌, ఇంటర్‌ విద్యార్థులతో కూడిన ముఠా 36 కిలోలకు పైగా గంజాయితో పట్టుబడింది. ఎనిమిది మంది విద్యార్థులు డబ్బులు పోగేసి గంజాయి కొనుగోలు చేసినట్లు ‘ఈగల్‌’దర్యాప్తులో వెల్లడైంది. ఈ విద్యార్థులు ఇదే తరహా కేసులో నాలుగోసారి పట్టుబడడం ఆందోళనకరం.

వినియోగంతో మొదలు..

విక్రయంతో ముగింపు

గంజాయి ముఠాలు ముందుగా కొందరు విద్యార్థులను వినియోగదారులుగా మార్చి.. ఆ తర్వాత వారినే చిన్నస్థాయి క్యారియర్లు, విక్రేతలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆందోళన ఉంది. మొదట స్నేహితుడి ద్వారా పరిచయం.. ఆపై ఉచితంగా లేదా తక్కువ ధరకు సరఫరా.. అలవాటు పడిన తర్వాత డబ్బుల కోసం ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వల విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన కేసులు చెబుతున్నాయి.

మాదక ద్రవ్యాల అనుకూల పంటల సాగు వద్దు

యువత దేశ భవిష్యత్‌కు వెన్నెముక. వారు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, మాదక ద్రవ్యాల తయారీకి అనుకూలమైన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకుండా చూడాలి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం, ఆచార్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

– డా. గాదె సమ్మయ్య, ప్రముఖ విద్యావేత్త

వరంగల్‌ నార్కొటిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్లలో నమోదైన కేసులు,

స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు), విలువ (రూ.లలో)

స్కూల్‌ దశనుంచే గంజాయి కిక్కుకు బానిసలు.. కళాశాలలే లక్ష్యంగా సరఫరా..

మత్తులో పెరుగుతున్న నేరాలు.. విద్యార్థులే ‘క్యారియర్లు’

నల్లగొండ ఘటనతో ఉలికిపాటు

మేల్కోకపోతే మరిన్ని ఘోరాలు..నేరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement