● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : కేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలుపడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకమని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తు, పరిష్కారం, కోర్టు విచారణ, శిక్షల సాధనకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసును క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా అవసరమైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి, కోర్టులో కేసు బలంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్ 164 కింద స్టేట్‌మెంట్లకు సంబంధించిన ప్రక్రియలను సకాలంలో పూర్తిచేసి, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఐసీజేఎస్‌లో కేసులకు సంబంధించిన వివరాలను అప్ డేట్ చేయడం, ఈ– సమన్ల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కోర్టు కేసుల్లో సమన్లు, నోటీసులు సకాలంలో అమలయ్యేలా సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతోపాటు కోర్టుల్లో శిక్షల శాతం పెంచడమే లక్ష్యంగా సీడీఓలు పనిచేయాలని స్పష్టం చేశారు. సాక్షుల హాజరు, సాక్ష్యాధారాల సమర్పణ, సంబంధిత రికార్డుల నిర్వహణ, కోర్టు ప్రక్రియలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
సమన్వయాన్ని పెంపొందించాలి
పోలీసు సిబ్బంది సంక్షేమంతోపాటు శాఖలో సమన్వయాన్ని పెంపొందిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలందించేలా పోలీసు అధికారుల సంఘం సహకరించాలని ఎస్పీ శబరీష్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఎస్పీ శబరీష్‌ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. పోలీసు సిబ్బంది సంక్షేమం, సమన్వయం, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణకు సంఘం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం 2026 ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రీరాం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సోములు (ఆర్‌ఐ, ఎంటీఓ), వెంకన్న (ఎస్సై, నర్సింహులపేట), కార్యదర్శి శేఖర్ (ఆర్ ఎస్సై), సంయుక్త కార్యదర్శి రామయ్య (ఏఆర్ పీసీ), ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.అనిల్ (పీసీ, మహబూబాబాద్ టౌన్), కోశాధికారి ఎల్.మంగీలాల్ (పీసీ డోర్నకల్), కార్యవర్గ సభ్యులు లింగస్వామి, సుప్రజ, సురేష్, నాగమణి, యాకన్నగౌడ్.. ఎస్పీని కలిశారు. ఎన్నికల నోడల్ అధికారిగా ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులుగా సీసీఎస్ సీఐ హతీరామ్, గూడూరు సీఐ వినయ్, భరోసా ఎస్సై దీపిక వ్యవహరించారు.


