అంబులెన్స్ అందించిన సేవలు
నెహ్రూసెంటర్: ఎక్కడ ప్రమాదం జరిగినా.. అత్యవసర అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే గుర్తొచ్చేది 108 అంబులెన్స్. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే క్షతగాత్రులు, బాధితులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించడంలో 108 అంబులెన్స్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో ఒక మండలం మినహా అన్ని మండలాలకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఏజెన్సీ మండలాలకు రెండేసి అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నారు. అయితే మానుకోట జిల్లా ఏర్పాటు అనంతరం ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతోపాటు మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య సేవల కోసం జనాలు ఎక్కువగా వస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఒక అంబులెన్స్‌తో పట్టణంలోని సుమారు లక్షజనాభాకు సేవలు సరిగా అందడంలేదు. దీంతో మరో అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలో..
మానుకోట జిల్లా ఏర్పడ్డ అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని 330 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. మానుకోట చుట్టుపక్కల ప్రాంతాలు, మండలాల ప్రజలు సైతం పెద్దాసుపత్రికి ఎక్కువగా వస్తున్నారు. ఏదేనీ ప్రమాదం జరిగినా, ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే 108కు ఫోన్ చేస్తున్నారు. అదే సమయంలో మరో చోట అంబులెన్స్ అవసరం ఏర్పడితే ఆలస్యమవుతుంది. రైల్వే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, గొడవలు, ఇలా జిల్లా కేంద్ర పరిధిలో జరుగుతుండగా ఒకే అంబులెన్స్‌తో సేవలు అందిస్తున్నారు. మానుకోటకు మరో 108 అంబులెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా క్షతగాత్రులకు, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశాలు ఉన్నాయి.
ప్రతిపాదనలు పంపించాం
జిల్లా కేంద్రంలో ఎక్కువగా ప్రమాదాలతోపాటు ఇతర కేసులు వస్తున్నాయి. ప్రతీ మండలానికి ఒక అంబులెన్స్ సేవలు అందిస్తుంది. ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్ సిబ్బంది వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఒక 108 ఉంది. మరో 108 అంబులెన్స్ కోసం ప్రతిపానలు పంపించాం.
– మహేష్, 108 ప్రోగ్రాం జిల్లా మేనేజర్
పెరుగుతున్న ప్రమాదాలు
జిల్లా కేంద్రానికి మరో 108 వాహనం తప్పనిసరి


