● ఈడీఎం యుగంధర్
మహబూబాబాద్: బాల్య వివాహలకు సహరిస్తూ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పు చేస్తే చర్యలు తప్పవని ఈడీఎం (ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్) యుగంధర్ హెచ్చరించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మీ సేవ నిర్వాహకులకు బాల్య వివాహ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యుగందర్ మాట్లాడుతూ.. బాల్య వివాహలు జరుగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా బాల్య వివాహలు జరుగుతున్నాయని.. ఆ వివాహలను ఆపాలన్నారు. బాల్య వివాహం నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహానికి సహకరించే అందరూ శిక్షకు అర్హులేనని తెలిపారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని, పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా స్టడీ సర్టిఫికెట్ మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి నరేష్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


