ఓల్టేజీ మెరుగు.. | - | Sakshi
Sakshi News home page

ఓల్టేజీ మెరుగు..

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

కెపాసిటర్‌ బ్యాంకులతో

హన్మకొండ: విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ఆధునిక, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం నిరంతరం శ్రమిస్తోంది. ఇదే క్రమంలో లైన్లలో కెపాసిటర్‌ బ్యాంకులు అమర్చి విద్యుత్‌ సరఫరాను మెరుగు పరుస్తోంది. సంస్థ పరిధిలో 14 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండడంతో గ్రామీణ విద్యుత్‌ ఫీడర్లపై ఇండక్షన్‌ లోడ్‌ అధికంగా ఉంటుంది. తద్వారా పవర్‌ ఫ్యాక్టర్‌ తగ్గి, విద్యుత్‌ ప్రవాహం పెరిగి ఓల్టేజీ డ్రాప్‌ ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంస్థ పరిధిలో రెండున్నర సంవత్సరాల కాలంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో 2 ఎంవీఏఆర్‌ కెపాసిటర్‌ బ్యాంకులు 303, 1 ఎంవీఏఆర్‌ కెపాసిటర్‌ బ్యాంకులు 89 ఏర్పాటు చేశారు. ఫలితంగా రైతాంగానికి నాణ్యమైన, స్థిరమైన ఓల్టేజీతో విద్యుత్‌ సరఫరా అందించడంతోపాటు సాంకేతిక విద్యుత్‌ నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మోటార్ల కారణంగా ఏర్పడే రియాక్టివ్‌ పవర్‌ డిమాండ్‌ను నియంత్రించేందుకు సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు.

రూ.21 కోట్ల మేర తగ్గిన ఆర్థిక భారం

కెపాసిటర్‌ బ్యాంకుల ఏర్పాటుతో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (పీటీఆర్‌)ల సామర్థ్యంపై ఉపశమనం కలుగుతుంది. దీంతో అనేక ప్రాంతాల్లో వెంటనే అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తగ్గించింది. 393 కెపాసిటర్‌ బ్యాంకులు ఏర్పాటుతో అదనంగా 66 కొత్త పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాట్లు ఆవశ్యకత లేకుండా పోయింది. తద్వారా రూ.21 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గింది. 11 కేవీ ఫీడర్లలో కెపాసిటర్‌ బ్యాంకులు అమర్చడం ద్వారా దాదాపు రూ.82 కోట్ల మేర సాంకేతిక నష్టాలు తగ్గాయని విద్యుత్‌ అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్‌ స్థాయిలో 2 ఎంవీఆర్‌ కెపాసిటర్‌ బ్యాంకులతోపాటు 11 కేవీ ఫీడర్‌ స్థాయిలో 600 కేవీఏఆర్‌ సామర్థ్యం కలిగిన కెపాసిటర్‌ బ్యాంకులు ఏర్పాటు చేశారు.

అటవీ ప్రాంతాల్లో

8 ఓల్టేజీ బూస్టర్లు ఏర్పాటు..

లైన్లలో ఓల్టేజీ డ్రాప్‌ తగ్గి, ముఖ్యంగా ఫీడర్‌ చివరి ప్రాంతాల్లో ఓల్టేజీ ప్రొఫైల్‌ మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్లతో పాటు ఇతర వినియోగదారులకు కూడా మరింత స్థిరమైన, నా ణ్యమైన ఓల్టేజ్‌ విద్యుత్‌ అందుతుంది. ఈ క్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల అటవీ, సుదూర ప్రాంతాల్లో మొత్తం 8 ఓల్టేజీ బూస్టర్లు అమర్చారు. కొత్త సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడం ఆచరణాత్మకంగా సాధ్యం కాని పరిస్థితులున్న అటవీ ప్రాంతాలు, పొడవైన లైన్లు ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఓల్టేజీ బూస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా లో ఓల్టేజీ సమస్య పరిష్కరిస్తున్నారు.

విద్యుత్‌ నష్టాల తగ్గింపు

వ్యవసాయ ఫీడర్లలో లోఓల్టేజీ

సమస్యకు పరిష్కారం

అదనపు పీటీఆర్‌ల ఏర్పాటు అవసరం లేక తగ్గిన ఆర్థిక భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement