జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్ట్‌

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

జనగామ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో జనగామ జిల్లా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట బంద్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునివ్వడంతో బుధవారం హైదరాబాద్‌ నుంచి నర్సంపేటకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై చెన్నకేశవులు, పోలీసులు వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పెంబర్తి వై జంక్షన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. నర్సంపేట పర్యటనకు అనుమతి లేదని, స్టేషన్‌కు రావాలని కోరడంతో ఆయన వాహనంనుంచి దిగి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలో ఎక్కించి జనగామ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. రైల్వేస్టేషన్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు దయాకర్‌రావును స్టేషన్‌నుంచి బయటకు తీసుకువచ్చి ప్రత్యేక ఎస్కార్ట్‌ మధ్య హైదరాబాద్‌ వైపు తరలించారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులను

అడ్డుపెట్టుకుని భూకబ్జాలు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులు, రెవెన్యూ అధికారులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. బుధవారం జనగామ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ శాఖలోని ఐఏఎస్‌ అధి కారులను ఉపయోగించుకుంటూ, పోలీసుల సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాలు భూకబ్జాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పేదల భూములను ఏదో ఒక కారణంతో లాక్కుంటూ, డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి నిజాయితీ, నర్సంపేట ప్రజలకు చేసిన సేవలు అందరికీ తెలుసన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూల్చివేయడం దారుణమన్నారు. ఎర్రబెల్లి వెంట గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పల్లా సుందర్‌రాంరెడ్డి, తాళ్ల సురేష్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఉడుగుల కిష్టయ్య, ఉల్లెంగుల సందీప్‌, సలీం, మాశెట్టి వెంకన్న, మంగ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

హైవేపై బైఠాయింపు.. ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement