నర్సంపేట రూరల్ : దైవ దర్శనానికి వెళ్తూ ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారు మల్లన్నగూడెం గ్రామానికి చెందిన తుమ్మన్నపల్లి గణేశ్ (40) ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గణేశ్‌కు భార్య అరుణ, కూతురు పునర్విసాయి, కుమారుడు అయిందవసాయిలు ఉన్నారు. కుమారుడు అయిందవసాయి సంబంధించి మేడారంలో మొక్కు ఉండడంతో బుధవారం తన తండ్రి రామాచారి, అత్తామామ బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన వంకోజు సుధాకరాచారి, లీలావతితోపాటు మరో ముగ్గురు కలిసి కారులో తెల్లవారుజామున గూడూరు నుంచి బయలుదేరారు. నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేట గ్రామానికి చేరుకోగానే కారు అదుపు తప్పి పల్టీ కొట్టుకుంటూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గణేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం వరంగల్‌కు రెఫర్ చేశారు. ప్రమాదం విష యం తెలుసుకున్న ఎస్సై అరుణ్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కారును ఆ ఇంటి ముందు నుంచి బయటకు తీయించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని గణేశ్ మృతదేహాన్ని పరిశీలించి, క్షతగాత్రులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మల్లన్నగూడెంలో విషాదం..
గూడూరు: మండలంలోని బొద్దుగొండ శివారు మల్లన్నగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన చెందిన తుమ్మన్నపల్లి గణేశ్ (40) తన భార్య అరుణ, ఇద్దరు పిల్లలతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి మేడారం వెళ్తుండగా కారు నర్సంపేట శివారు ముత్తోజిపేటలో అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గణే శ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న మల్లన్నగూడెం గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతూ నర్సంపేటకు చేరుకున్నారు. వార్డు సభ్యుడుగా గెలిచి గ్రామస్తులతో చెలిమిగా ఉండే గణేశ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం మల్లన్నగూడెం చేరుకోగా ఊరంతా విలపించింది.
అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరి మృతి
పలువురికి గాయాలు
ముత్తోజిపేటలో ఘటన


