ములుగు : ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాల కొరత, ర్యాక్ మూమెంట్ లేకపోవడంతో బియ్యం డెలివరీలు చేయలేక రైస్ మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులు ఎఫ్‌సీఐ జీఎం అనూజ్ త్యాగి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జీఎం అనూజ్ త్యాగిని కలిసి సమస్యలు వివరించారు. గోదాముల్లో బియ్యం నిల్వ చేసేందుకు తగిన స్థలాలు ఏర్పాటు చేయడంతోపాటు ర్యాక్ మూమెంట్ చేపట్టాలని కోరారు. సమస్యలపై జీఎం అనూజ్ త్యాగి సానుకూలంగా స్పందిస్తూ సెప్టెంబర్‌లో ర్యాక్ మూమెంట్ జరిగేలా చర్యలు తీసుకుంటామని, గోదాముల్లో స్థలాల లభ్యత కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, కార్యదర్శి సహోదర రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, మహబూబాబాద్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సీనియర్ రైస్ మిల్లర్ యుగంధర్, శ్రావణ్ పాల్గొన్నారు.
చెరువుల పంపకాల
విషయంలో గొడవ
● వ్యక్తి దారుణ హత్య
● మడిపల్లిలో ఘటన
తొర్రూరు రూరల్: చెరువుల పంపకాల విషయంలో జరిగిన గొ డవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల గ్రామానికి చెందిన ఏదుల వెంకన్న(ముదిరాజ్ కులస్తుడు) అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మృతుడి 5వ రోజు కార్యక్రమం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన గుంటుక రమేశ్(43), యాకన్న, వెంకన్న, జంపయ్య, మహేశ్‌తోపాటు మరికొంత మంది పాల్గొన్నారు. కాగా, కార్యక్రమం సందర్భంగా చెరువుల పంపకాల విషయంపై కొందరు గొడవ పడ్డారు. ఈ సమయంలో మాటామాటా పెరిగి కర్రలు, రాళ్లతో గుంటుక రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో రమేశ్ భయపడి అక్కడి నుంచి గ్రామ శివారులోని చెరువు వైపునకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయినా వెంబడించి కర్రలు, రాళ్లతో కొట్టి రమేశ్‌ను హత్య చేశారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రమేశ్ మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


