● విద్యుదాఘాతంతో మహిళ మృతి
● పాత రెడ్యాలలో ఘటన
మహబూబాబాద్ రూరల్ : విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం పాత రెడ్యాలలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాత రెడ్యాల గ్రామానికి చెందిన పర్షిక బుచ్చమ్మ (49) దుస్తులు ఉతికిన అనంతరం ఇంటి ఆవరణలో గల ఇనుప (బైండింగ్) తీగపై ఆరేస్తోంది. అంతలోనే ఆ తీగకు విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురైంది. దీనిని గమనించిన కుమారుడు అనిల్.. తల్లి (బుచ్చమ్మ)ని కాపాడే ప్రయత్నం చేయగా అతడు కూడా విద్యుదాఘాతానికి గురై స్వల్ప ప్రమాదంతో బయటపడ్డాడు. బుచ్చమ్మ స్పృహతప్పి కిందపడిపోగానే కుటుంబీకులు వెంటనే 108లో మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బుచ్చమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు అనిల్ ఫిర్యాదు రూరల్ ఏఎస్సై రమేశ్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కాగా, బుచ్చమ్మ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రైలు ప్రమాదంలో పాంనూర్ పోస్టుమాన్ మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూర్ పోస్టుమాన్ కందుకూరి గోపాలకిషన్(50) మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరి కూతురు పిల్లలకు బుధవారం ఇరవై ఒకటి రోజు వేడుక ఉండగా మంగళవారం భార్య జయ, కుమారుడు లఖన్‌తో కలిసి గోపాలకిషన్ రైలులో సికింద్రాబాద్ వెళ్లారు. అక్కడ దిగాక మూత్ర విసర్జన కోసం మరో రైలులోకి ఎక్కాడు. అనంతరం రైలు దిగుతుండగా ఒక్కసారిగా కదిలింది. దీంతో ప్రమాదవశాత్తు రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన భార్య, కుమారుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గోపాలకిషన్ మృతితో పాంనూర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.


