● మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్
గీసుకొండ : సీఎం రేవంత్‌రెడ్డి అయినా, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అయినా.. ఆయన (ప్రకాశ్ రెడ్డి) తాత అయినా ఎవరు వచ్చినా పరకాల నుంచి తాను పోటీ చేసి గెలుస్తానని, రాబోయే 20 ఏళ్ల వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితాపటేల్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొండావర్గం నాయకుడు రడం భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఆమె కూతురు సుస్మితా పటేల్ కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వయంగా సీఎం వచ్చి ప్రచారం చేసినా గెలుపు తనదే అన్నారు. తాను చెప్పిన విషయంలో కౌంటర్ ఇస్తే అన్నీ బయట పెడతానన్నారు. ఇటీవల పరకాలలో జరిగిన సభలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలిపించాలని సీఎం అన్నారని, రేవూరికి ఎన్నికల ముందు పరకాల అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. డైపర్లతో తిరుగుతున్న రేవూరికి మరోసారి టికెట్ ఇచ్చుడేందని, జెన్‌జీ వ్యక్తులకు టికెట్ ఇస్తానన్న సీఎం ఇప్పుడు ఇలా ప్రకటించుండేదని ప్రశ్నించారు. రెండేళ్ల దాకా ఎందుకు ఇప్పుడు రేవూరిని రాజీనామా చేయమని చెప్పాలని, సీఎం అతడి తరఫున ప్రచారం చేయాలని, అప్పుడు అతడు గెలుస్తడో లేదంటే కొండా కుటుంబం గెలుస్తుందో చూడాలని సవాల్ విసిరారు. నాయకులు గోపాల నవీన్‌రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


