● వాయిదా వేయాలని విద్యార్థుల ఆందోళన
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండోసెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే బుధవారం యూనివర్సిటీలోని కొందరు రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు వాయిదావేయాలని పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడి అలుమనాక్ ప్రకారం ఈ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాయిదావేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పలువురు విద్యార్థులు తమకు ఇతర పోటీ పరీక్షలున్నాయని, అందుకే వాయిదావేయాలని డిమాండ్ చేశారు. ఒక్క క్యాంపస్ విద్యార్థులే కాదని ఇతర మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ పీజీ రెండో సెమిస్టర్ రాసే విద్యార్థులున్నారని, వాయిదావేయబోమని తెలిపారు. తొలుత విద్యార్థులు రిజిస్ట్రార్ రామచంద్రంను కూడా కలిసి పరీక్షలు వాయిదా వేయాలని విన్నవించారు. కాగా, ఈ విషయంపై కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు యథావిధిగా ఈనెల 20నుంచి జరుగుతాయని చెప్పారు. యూనివర్సిటీ పరిధిలో 3,813 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని రాజేందర్ తెలిపారు.


