లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం..

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

ములుగు రూరల్‌ : మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన వారు సమాజంలో విలీనమై జీవించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. సోమవారం కర్రెగుట్టల పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు హెల్త్‌ కార్డులు, రివార్డు చెక్కులు అందజేశారు. రాజమండ్రి జిల్లా ఆర్యాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్‌ మాధవి అలియాస్‌ దుర్గ అలియాస్‌ షకీల (దివంగత మావోయిస్టు పటేల్‌ సుధాకర్‌ రెడ్డి భార్య) డీజీపీ పర్యటన సందర్భంగా ములుగు జిల్లాలో ఆమె లొంగుబాటును చూపించారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందించే రూ. 20 లక్షల రివార్డు చెక్కును అందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమత 40 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్‌లో పని చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి బతకడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, అతడి భార్య లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులు తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో చర్చించి తీసుకోవలసిన నిర్ణమని పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా పోయిందని తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్‌ వన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, సీఆర్పీఎఫ్‌ ఏడీజీ విక్రమ్‌సింగ్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధు శర్మ, కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, ఏఎస్పీ మమన్‌ భట్‌ పాల్గొన్నారు.

రివార్డు చెక్కులు, హెల్త్‌ కార్డులు అందజేత

మావోయిస్టు సీనియర్‌ నాయకురాలు సమత లొంగుబాటు

విలేకరుల సమావేశంలో

డీజీపీ సీవీ ఆనంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement