ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వరంగల్ హంటర్‌రోడ్డు ఉర్సుగుట్ట తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయుడు పెట్రోల్ పంప్ కాలనీకి చెందిన బంక కొమురయ్య (70) పని నిమిత్తం ఉర్సుగుట్ట వైపు వెళ్లి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో కొమురయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు.
గుండెపోటుతో ఏఆర్ ఎస్సై..
వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్‌ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.శామ్యూల్ (57) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట జంక్షన్ వద్ద తన నివాసం నుంచి రోజు వారీగా విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శామ్యూల్ మృతితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


