హన్మకొండ/వర్ధన్నపేట : వరంగల్ మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నాయకత్వంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని, నేడు ఆ కల నెరవేరుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ పర్యటనకు రావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. మామునూరు విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు, సమీప ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కల్పించాలని కొండేటి శ్రీధర్, వన్నాల వెంకటరమణ మంత్రిని కోరారు. విమానాశ్రయం పునరుద్ధరణతో వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధితో పాటు వ్యాపార రంగానికి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నేతలు


