● పెద్ద చెరువును నింపితేనే సస్యశ్యామలం
● ఎత్తిపోతల పథకంలో చోరీకి గురైన విద్యుత్ మోటర్లు
● వినియోగంలోకి తేవాలంటున్న రైతులు
డోర్నకల్: డోర్నకల్ పట్టణ శివారు మున్నేరువాగు నుంచి పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథకం దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారింది. పెద్దచెరువు కింద రెండు వందల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా.. ప్రతీ సంవత్సరం మత్స్యకారులు చేపల పెంపకం చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పెద్ద చెరువులో నీటి నిల్వలు అడుగంటాయి.
2012లో ఎత్తిపోతల ఏర్పాటు..
మున్నేరువాగు నుంచి పెద్ద చెరువుకు నీటిని తరలించి ఆయకట్టు భూముల్లో రెండు పంటలు పండించాలనే ఉద్దేశంలో 2012లో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. వాగు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు రూ.1,53,91,000 నిధులతో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసి 20 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ మోటార్లు, కంట్రోల్ ప్యానల్ బోర్డు, రెండు స్టార్టర్లు, 3 హెచ్‌పీ వాక్యూ మ్ పంప్ మోటారునుు ఏర్పాటు చేశారు. లిఫ్ట్ కోసం షెడ్డు పక్కనే ప్రత్యేకంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. మున్నేరువాగు నుంచి పెద్ద చెరువు వరకు రెండు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌ను ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల పాటు వాగు నుంచి చెరువుకు నీటిని తరలించారు. అనంతరం విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో లిఫ్ట్ సేవలు మూలనబడ్డాయి.
విద్యుత్ మోటార్లు చోరీ..
లిఫ్ట్ పని చేయకపోవడం, షెడ్డుకు రక్షణ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఖరీదైన 20 హెచ్‌పీ విద్యుత్ మోటార్లను చోరీ చేశారు. ప్యానల్ బోర్డును ధ్వంసం చేసి దాంట్లో విలువైన పరికరాలను ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైరును సైతం చోరీ చేశారు. గతేడాది మే నెలలో విద్యుత్ మోటార్ల చోరీని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నేటికీ చోరీపై విచారణ జరగలేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులతో పెద్ద చెరువులో నీటి నిల్వలు అడుగంటాయి. చెరువు కింద భూములు సాగు చేస్తున్న రైతులు లిఫ్ట్‌ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చెరువు సందరీకరణ పనులు పూర్తవుతుండడం, బతకమ్మ పండుగ సమీపిస్తుండటంతో చెరువుకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.


