● ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : గిరిజన మహిళల ఐక్యతకు, సంప్రదాయ పరిరక్షణకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లతండా గ్రామంలో తీజ్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై తీజ్ పండుగ విశిష్టతను, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. తీజ్ పండుగ గిరిజన మహిళల ఆధ్యాత్మిక విశ్వాసానికి, కుటుంబ సౌభాగ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తండాల్లో సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తండా పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
‘తీజ్’ వేడుకల్లో ప్రభుత్వ విప్..
కురవి: మండలంలోని గాజాతండా గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తీజ్ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ పాల్గొన్నారు. యువతులతో కలిసి రాంచంద్రునాయక్ తీజ్ బుట్టలను ఎత్తుకుని నృత్యాలు చేశారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఆయన వెంట తండా యువతులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


