● నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు
● చిత్రపటం వద్ద నివాళి
● పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
● రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ
సభ్యులకు అందించిన మాజీ సీఎం
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తంగా రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి ఎర్రవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు.
ప్రముఖుల పరామర్శ..
మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్, వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి అమర్ రహే’, ‘జోహార్ పెద్ది’ నినాదాలు మార్మోగాయి. పలుచోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీవన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సంతాప సభ ఏర్పాట్లపై ఆరా..
నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్‌రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్‌తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించారు.


