గార్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేక్ సర్టిఫికెట్‌తో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న సీహెచ్.సత్యనారాయణకు ఆర్‌జేడీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి ఆదివారం వెల్లడించారు. సత్యనారాయణ బిహార్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స్ సర్టిఫికెట్ పొందినట్లు ఇంటర్ బోర్డు విచారణలో తేలింది. వారం రోజుల్లో ఇంటర్ బోర్డుకు లెక్చరర్ సత్యనారాయణ వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర్‌చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు.
రామలింగేశ్వరస్వామికి పూజలు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్‌లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు.
కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలి
కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్‌నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల మీట్‌లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి ఉన్నారు.


